అమలాపురం అల్లర్లలో దర్యాప్తు నత్తనడక.. అరెస్టుల ప్రకటనకే సరా
Publish Date:May 29, 2022
Advertisement
రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమలాపురం అల్లర్ల వెనుక కుట్ర కోణంపై పోలీసులు ఎందుకు దృష్టి సారించడం లేదు. ఇప్పటి వరకూ అంత మందిని అరెస్టు చేశాం, ఇంత మందిని అరెస్టు చేశాం అంటూ ప్రకటనలు గుప్పించడం వినా అమలాపురం అల్లర్లకు సంబంధించి లోతుల్లోకి పోలీసులు వెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు సంగతి అలా పెడితే.. కోనసీమ కాశ్మీర్ అన్నట్లగా వారం రోజులు ఇంటర్ నెట్ నిలిపివేశారు. అనుమానితుల వాట్సప్ చాట్ లను, ఫోన్ సంభాషణలనూ పరిశీలిస్తున్నామని చెబుతున్నారు. సీసీ కెమేరాల ఫుటేజీల ఆధారంగా అరెస్టు చేసిన వారిలో అత్యధికులు వైసీపీ కార్యకర్తలు, మంత్రుల అనుచరులే కావడంతో ఈ కేసులో లోతులకు వెళ్లడానికి పోలీసులకు ‘పై’ నుంచి ఒత్తిడులు వస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఏకంగా మంత్రి ఇంటినే ధ్వంసం చేసినా పోలీసులు ఉదాశీనంగా ఉండటానికి కారణాలేమిటన్న ప్రశ్నలు సామాజిక మాధ్యమంలో వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి కోనసీమ ఉద్యమం పేరుతో రాజకీయం చేసినది వైసీపీ రాష్ట్ర స్థాయి నేతేనని స్థానికలు కుండ బద్దలు కొట్టి చెబుతున్నా.. పోలీసులు ఆయనను కనీసం ఇప్పటి దాకా విచారించను కూడా విచారించలేదు. తాము కేసు దర్యాప్తు విషయంలో సీరియస్ గా ఉన్నామని చెప్పడానికి మాత్రం రోజుకు కొంత మందిని అరెస్టు చేసినట్లు ప్రకటిస్తున్నారు.కోనసీమ అల్లర్ల కేసు విషయంలో తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/police-25-136646.html





