తిరుమలలో ప్లాస్టిక్ కు ప్రవేశం లేదు.. ఎట్టకేలకు టీటీడీ కీలక నిర్ణయం
Publish Date:May 31, 2022
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్టకేలకు కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం అంటే జూన్ 1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు పేర్కొంది. కొండపై ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేసింది. కొండపైకి ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులనూ అనుమతించేది లేదని కుండబద్దలు కొట్టింది. అలిపిరి టోల్ గేట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి ప్లాస్టిక్ వస్తువులను కొండపైకి రాకుండా గట్టి చర్యలు తీసుకుంటామంది. కొండపైకి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించని విధంగా నిఘా పెట్టనున్నట్లు తెలిపింది. ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే అనుమతిస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ నిషేధం కచ్చితంగా, కఠినంగా అమలయ్యేలా సహకరించాలని టీటీడీ కోరింది. ఆఖరికి షాంపూ ప్యాకెట్లను కూడా కొండపైకి అనుమతించబోమని స్పష్టం చేసింది. పిల్లల ఆట బొమ్మలపై ఉండే ప్లాస్టిక్ కవర్లు సైతం కొండపైన కనిపించకూడదని స్పష్టం చేసింది. కొండ మీద వ్యాపారులు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేసుకోవాలని టీటీడీ ఆదేశించింది. కొండపై ఉన్న హోటళ్లు, దుకాణదారులతో టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమావేశం అయ్యారు.జూన్ 1 నుంచి తిరుమలలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నామని.. దుకాణదారులు, హోటళ్లు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని హెచ్చరించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రధాన దేవాలయాలలోనూ ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిగా అమలు చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్తానం ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
http://www.teluguone.com/news/content/pkastic-ban-in-tirumala-25-136774.html





