చంద్రబాబు-పెగాసస్ వెనుక పీకే స్కెచ్!.. జగన్-మమత మిలాఖత్!?
Publish Date:Mar 19, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్’లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా? ఇంతవరకు, దూరం దూరంగా ఉన్న మాజీ మిత్ర పక్షాలు, టీడీపీ, బీజేపీ, జనసేనలు మళ్ళీ మరోసారి దగ్గరయ్యే దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే, అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో రాష్టంలో రాజకీయ శక్తుల పునరేకీకరణ చర్చ మరో మారు తెరమీదకు వచ్చింది. కాగా, పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా, ప్రభుత్వ (వైసీపీ) వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల నేపధ్యంగా, ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ టీడీపీతోనూ పొత్తు ఉంటుందని చెప్పకనే చెప్పారని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాగే, ఇంతవరకు బీజేపీ, వైసీపీల మధ్యకొనసాగుతున్న రహస్య ఫెవికాల్ బంధం పుటుక్కుమనే సంకేతాలు కనిపిస్తున్నాయా, అంటే, అందుకూ రాజకీయ విశ్లేషకుల నుంచి అవునననే సమాధానమే వస్తోంది. నిజానికి, జగన్మోహన్ రెడ్డి, బీజేపీతో చెలిమి చేస్తున్నా, ఆయన మనసు మాత్రం బీజేపీ ఓటమినే కోరుకుంటోంది. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే, జగన్ రెడ్డి, ‘బ్యాడ్ లక్’ కేంద్రంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ వచ్చింది. ఇక ఏపీకి ప్రత్యేక హోదా రాదు’ అని చేతులు ఎత్తేశారు. అంటే, బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడం ఆయనకు ఇష్టంలేదని, మనసులో మాటను బయట పెట్టారు. అయినా, ప్రత్యేక హోదా విషయం పక్కకు పోయినా, గడచిన మూడేళ్ళుగా, బీజేపీ, వైసేపీల రహస్య స్నేహబంధం, మూడు ముద్దులు, ఆరు హగ్గులుగా సాగిపోతూనే ఉంది. అందుకే, జగన్ రెడ్డి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నా, ఆర్థిక వ్యవస్థను సమూలంగా సర్వనాశనం చేసినా, కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూనే వుంది కానీ, బాధ్యతగా తీసుకోవలసిన చర్యలు ఏవీ తీసుకోలేదు. అంతే కాదు, అప్పులు పెంచుకుంటూ పోవడానికి అనుమతులు ఇచ్చుకుంటూ పోయింది.ఒక విధంగా చూస్తే నువ్వొకందుకు పోస్తే నేనొకందుకు తాగుతున్నాను అన్నట్లుగా బీజేపీ, వైసీపీ రహస్య ప్రేమను బహిరంగంగా చాటుకున్నారు. అయితే, తాజా పరిణామాల నేపధ్యంలో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోందని, పరిశీలకులు అంటున్నారు. జాతీయ రాజకీయాలలో బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు జరుగుతున ప్రయత్నాలకు ఇంతవరకు జగన్ రెడ్డి దూరంగానే ఉన్నారు. అయితే, రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నా నేపద్యంలో, జగన్ రెడ్డి తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీకి దగ్గరయ్యే దిశగా కడులుతున్నారని, అటు మమత, ఇటు జగన్ రెడ్డి ఇద్దరికి, ప్రశాత్ కిషోర్’ వారధిగా పనిచేస్తున్నారని, ఆయన డైరెక్షన్’ లోనే మమత బెనర్జీ, పెగాసస్ స్పైవేర్ మురికిని చంద్రబాబు నాయుడుకి పులిమే ప్రయత్నం చేశారని అంటున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర ప్రదేశ్’ ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్’ ను కొనుగోలు చేసిందని ఆమె ఓ సరికొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చారు. మమతా బెనర్జీ ఏ ఆధారాలతో ఈ ఆరోపణ చేశారో ఏమో గానీ, దున్నపోతు ఈనింది అంటే, దూడను కట్టేయమన్నట్లుగా వైసీపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం వెంటనే, ఒక కమిటీ చంద్రబాబు నాయుడును బోనులో నిలబెట్టి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి, నిజంగా గత ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్’ ని కొని ఉంటే, అందుకు సంబందించిన వివరాలు ప్రభుత్వం వద్ద ఉండకుండా ఉండవు. అయినా ఈ మూడేళ్ళలో ఎప్పుడు వైసీపే ప్రభుత్వం ఆవిషయం ఎక్కడా ప్రస్తావించలేదు. అయినా , కనీసం వాటిని పరిశీలించే ఆలోచన అయినా చేయకుండానే, వైసీపే ఎంపీ, నందిగం సురేష్ మేడి ముందుకు వచ్చి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు. నిజానికి, పెగాసస్ స్పైవేర్’ వ్యవహారంలో సుప్రీం కోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. అంతే కాదు, సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన విచారణ కమిటీ, కేవలం కేంద్ర ప్రభుత్వం పెగాసస్ స్పైవేర్’ కొన్నది నిజమేనా, నిజమైతే దుర్వినియోగం చేసింది నిజమా అనే కోణంలోనే కాదు, ఆంధ్ర ప్రదేశ్ సహా అన్ని రాష్ట్ర ప్రభత్వాల ప్రమేయాన్ని కూడా విచారిస్తోంది. సో.. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. అయినా, ఇలా మమతా బెనర్జీ ఏ ఆధారం చూపకుండా ఆరోపణ చేయడం, ఆ వెంటనే వైసీపే నేతలు చంద్రబాబు నాయుడును టార్గెట్ చేయడమే కాకుండా, కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమండ్ చేయడంతో, బీజేపీ, వైసీపీల మధ్య జగడం మొదలైందని అనుకోవచ్చని పరిశీలకులు అంటున్నారు. మరోవంక విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, బీజేపీ రాయలసీమ రణభేరి సభ ఏర్పాటు చేయడాన్ని ఎద్దేవా చేశారు. అంతేకాదు మూడేళ్ళలో మొదటి సారిగా, కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయలేదనే మాట వైసీపే మంత్రి నోటి నుంచి వచ్చింది. సో.. ఒక .. వైసీపీ , బీజేపీతో తెగతెంపులు చేసుకునేందుకు సిద్దమైందని అనుకోవచ్చని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/pk-sketch-behind-pegasus-chandrababu-issue-39-133250.html





