పెట్రో ధరలు తగ్గించవా జగన్? కనికరం చూపించవా కేసీఆర్?
Publish Date:Nov 6, 2021
Advertisement
దేశంలో ఇప్పుడంతా పెట్రోల్, డీజిల్ రేట్ల తగ్గింపుపైనే చర్చ. తెలుగు స్టేట్స్‌లోనూ ఇదే టాపిక్. మన దగ్గర రేట్ ఎంత? మోదీ ఎంత తగ్గించారు? మనోళ్లు ఎందుకు తగ్గించరు? ఇలా ఒకటే రచ్చ. దీపావళి ఆఫర్‌గా కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ లీటరుకు రూ.10 తగ్గించడంతో వాహనదారులకు భారీ ఊరట లభించినట్టైంది. కేంద్రం బాటలోనే ఎన్డీయే పాలిత రాష్ట్రాలు సైతం తమ వాటా రూ.7 తగ్గించుకోవడంతో ఇంధన ధరలు దిగొచ్చాయి. దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. అందులో 22 స్టేట్స్ వ్యాట్ తగ్గించుకున్నాయి. ఉలుకూ పలుకు లేకుండా.. మొండిగా ఉన్న రాష్ట్రాలు ఆరంటే ఆరు. అందులో మన రెండు తెలుగు స్టేట్స్ ఉండటంపై ప్రజలు మండిపడుతున్నారు. ఏపీ తీరు మరింత దారుణంగా ఉంది. యావత్ దేశంలోకే పెట్రో రేట్స్ అత్యధికంగా ఉన్న రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఏపీకంటే ఒక్క రాజస్థాన్‌లోనే ధర కాస్త ఎక్కువ. అంతలా పన్ను దోపిడీ జరుగుతోంది ఏపీలో. ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ110కి పైనే ఉంది. అదే పక్కనే ఉన్న కర్ణాటకలో వంద రూపాయలు మాత్రమే. అంటే, సరిహద్దు దాటితే 10 రూపాయలు తక్కువకే వస్తోంది పెట్రోల్. అదే చెన్నైలో రూ.101 మాత్రమే. ఒడిశాలో 104. ఇలా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ బాగా చీప్‌గా వస్తోంది. లీటర్‌కు రూ.10 తక్కువంటే మాటలా? దాదాపు 10శాతం డిస్కౌంట్ అన్నట్టు. మరి, మనకే ఎందుకింత ఖరీదంటే.. అందుకు కారణం జగనన్న. వైసీపీ పాలనలో అన్నిటి ధరలూ పెరిగినట్టే.. పెట్రోల్, డీజిల్ రేట్లూ మిగతా వారికి తగ్గినా.. ఏపీ ప్రజలకు మాత్రం తగ్గడం లేదు. అందుకే కొందరు జగన్ తో పనిలేకుండా సరిహద్దులు దాటేసి పక్క రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటున్నారు. ఒక చేత్తో రూ.10 ఇచ్చి.. మరో చేస్తో రూ.20 లాగేస్తున్నారంటే ఇదే. 22 రాష్ట్రాలు రూ.7 వ్యాట్ తగ్గిస్తే.. మరి జగనన్న ఎందుకు తగ్గించరు? మోదీకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసే వైసీపీ ప్రభుత్వం.. పెట్రో ధరల తగ్గింపు విషయంలో కేంద్రాన్ని ఎందుకు ఫాలో అవదు? అసలే అప్పుల రాష్ట్రం. ఒకటో తారీఖున జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. పన్ను తగ్గిస్తే మరింత ఆర్థిక ఊబిలో కూరుకుపోతుందని భయపడుతున్నారో ఏమో. లేక, ఇంధనంపై ట్యాక్స్ కట్ చేయకుండా.. జగనన్న పెట్రో పథకం తీసుకొచ్చి అకౌంట్లో డబ్బులు ఏస్తారో ఏమో..!! ఇక, జగన్ లానే ఆయన రహస్య స్నేహితుడు కేసీఆర్ సైతం ప్రజల చేతి చమురు లాగేస్తున్నారు. గతంలో మోదీ ఏ పని చేసినా.. ఆయన్ను పొగుడుతూ.. ఆకాశానికి ఎత్తేసిన కేసీఆర్.. పెట్రో ధరలపై పన్ను తగ్గింపు విషయంలో మాత్రం మోదీ మార్గంలో నడవడం లేదు. తెలంగాణలో పెట్రోల్ రేట్ 108కి పైనే. దేశంలోనే ఏపీ నెంబర్ 2 అయితే, తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. హైదరాబాద్‌లో ఇంధన వినియోగం అధికంగా ఉండటంతో పన్ను రూపంలో ఖజానా గలగలలాడుతోంది. కాళేశ్వరం, రైతుబంధు, దళితబంధు లాంటి పథకాలతో.. ధనిక రాష్ట్రాన్ని దివాళ పరిస్థితికి తీసుకొచ్చిన కేసీఆర్.. పెట్రో ట్యాక్స్ తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థ మరింత ఆగమాగం అవుతుందని అనుకుంటున్నారు. అందుకే, ప్రజల నుంచి ఎంతగా డిమాండ్ వస్తున్నా.. పెట్రోల్, డీజిల్ రేట్లు మాత్రం తగ్గించకుండా దోపిడీ కంటిన్యూ చేస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలు.. జిద్దుగా..మొండిగా.. వ్యవహరిస్తుండటంపై తెలుగు ప్రజలు మండిపడుతున్నారు. ఇద్దరు మోనార్క్ సీఎంల తీరుపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/petro-rates-pressure-on-jagan-and-kcr-39-125911.html





