నిమ్మగడ్డ కేసులో ఊహించని మలుపు.. అసలు ఆయన నియామకమే చెల్లదు!!
Publish Date:Jun 9, 2020
Advertisement
నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. నిమ్మగడ్డను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునర్నియమించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇప్పటికే జగన్ సర్కార్ సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిమ్మగడ్డకు వ్యతిరేకంగా హైకోర్టులోనూ ఓ పిటిషన్ దాఖలైంది. ఎన్నికల కమిషనర్ నియామకం రాష్ట్ర మంత్రి మండలి సిఫారసు మేర జరగడానికి వీల్లేదని, పూర్తిగా గవర్నర్ విచక్షణ మేరకే జరగాలంటూ హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. నిమ్మగడ్డ నియామకాన్ని సవాలు చేస్తూ గుంటూరు జిల్లా, ఉప్పలపాడు గ్రామానికి చెందిన సంగం శ్రీకాంత్‌రెడ్డి కో వారెంట్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డను ఎన్నికల కమిషనర్‌గా నియమించాలని 2016లో అప్పటి సీఎం చంద్రబాబు సారథ్యంలోని మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. దీని ఆధారంగా నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల్లో నిమ్మగడ్డను తప్పించి, కనగరాజ్‌ను నియమిస్తూ వైఎస్ జగన్ సారథ్యంలోని మంత్రివర్గం గవర్నర్‌కు సిఫారసు చేసింది. దాన్ని ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదించడాన్ని ఇందులో ప్రధానంగా ప్రస్తావించారు. అయితే, ఆ ఆర్డినెన్స్ చెల్లదంటూ తాజాగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. చట్టబద్ధత గల ఓ స్వతంత్ర సంస్థకు కమిషనర్‌గా కనగరాజ్‌ను మంత్రివర్గం సిఫారసు చేయడమేంటని హైకోర్టు ప్రశ్నించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం–1994లోని సెక్షన్–200 కింద ఎన్నికల కమిషనర్‌గా ఎవరిని నియమించాలని సిఫారసు చేసే అధికారం గానీ, అర్హతలను నిర్ణయించే అధికారం గానీ మంత్రి మండలికి లేదని హైకోర్టు అభిప్రాయపడింది. మంత్రివర్గ సిఫారసు చేసిన కనగరాజ్ నియామకం చెల్లదని పేర్కొంది. సరిగ్గా ఇప్పుడు ఇదే పాయింట్ మీద శ్రీకాంత్ రెడ్డి కోవారెంట్ పిటిషన్ ను దాఖలు చేశారు. మంత్రివర్గం సిఫారసు చేసిన నిమ్మగడ్డ నియామకం కూడా చెల్లదని, ఆయనను ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ 2016లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవో 11ను కొట్టేయాలని శ్రీకాంత్ రెడ్డి కోరారు.
http://www.teluguone.com/news/content/petition-filed-in-ap-high-court-against-nimmagadda-ramesh-kumar-39-100057.html





