సీఎం జగన్ ఇంటి ముందు ధర్నాకు సిద్ధమంటున్న పేర్ని నానీ!
Publish Date:Jul 20, 2023
Advertisement
మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, కాపు నాయకుడు పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పేర్ని నానీ వ్యాఖ్యలు అప్పుడప్పుడూ సంచలనం అవుతుండడం కద్దు. ఇప్పుడు ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేసేందుకు కూడా తాను సిద్ధమేనని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తాం అని ప్రకటించిన పేర్ని నానీ.. కావాలంటే ఏలూరు జిల్లా పరిషత్ సభ్యులతో పాటు ఈ జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లి మరీ తమ తడాఖా ఏంటో చూపిస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా పేర్ని నాని వ్యాఖ్యలు కలకలం రేపాయి. నిన్నటి వరకూ జగన్ మంత్రి వర్గంలో ఉన్న పేర్ని ఒక్కసారిగా ఇలా సీఎం ఇంటి ముందు ధర్నా కూర్చుంటానని ప్రకటించడంతో సొంత పార్టీలో కూడా అటెన్షన్ మొదలైంది. అసలు పేర్ని నానీ వ్యాఖ్యల వెనక కారణం చూస్తే విస్తుపోవడం ఖాయం. బుధవారం ఏలూరు జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జెడ్పీటీసీలు సహా ప్రొటోకాల్ ప్రకారం.. జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు కూడా వచ్చారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న నూజివీడు, మచిలీపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పేర్ని నాని, మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తదితరులు కూడా హాజరయ్యారు. మధ్యాహ్నం 4 గంటల వరకు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానాలు చేయలేదు.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. కారణం ఎక్స్ అఫిషియో సభ్యుడైన ఏలూరు జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అందరూ ఈ సమావేశానికి డుమ్మా కొట్టేశారు. వారి సమక్షంలోనే ఆయా సమస్యలపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉండగా.. వారు మాత్రం ఈ సమావేశాలకు రాలేదు. దీంతో ఒక్కసారిగా జెడ్పీ సభ్యులు అందరూ పేర్ని నానిపై ఒత్తిడి తేవడంతో నాని రెచ్చిపోయారు. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఎవరూ సమావేశానికి హాజరు కాకపోవడంతో నానీ.. కలెక్టర్‌కు అసలు మేం ఎలా కనిపిస్తున్నాం. ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా.. లేక మీ కింద నౌకర్లు అనుకుంటున్నారా? ఆయన కోసం మేం వేచి ఉండాలా.. మాకు మాత్రం పనులు ఉండవా.. మేము రాలేదా అని ఆగ్రహంతో ఊగిపోయారు. అంతేకాదు కలెక్టర్‌పై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేస్తాం.. జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లాలోని ఎమ్మెల్యేలతో కలిసివెళ్లి తాడేపల్లి వద్ద ధర్నాకు దిగుతాం. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టిలో ఉంచుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏలూరు జిల్లాలో కలెక్టర్, ఉన్నతాధికారులు.. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న అంతర్యుద్ధం బయటపడింది. కలెక్టర్ సహా ఉన్నతాధికారులు అంతా పనిగట్టుకొని సమావేశానికి డుమ్మా కొట్టారంటే ఇక్కడ రాజకీయం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఈ సమస్య ఈ రోజుది కాదు.. ఈ సమావేశానిది మాత్రమే కాదు. వరుసగా రెండు సమావేశాలకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ డుమ్మా కొట్టారు. కలెక్టర్ రారని తెలిసి ఉన్నతాధికారులు కూడా ఎవరూ సమావేశాలకు రావడం లేదు. గతంలో వైసీపీ నేతలు, ఈ అధికారుల మధ్య పలుమార్లు జరిగిన వాగ్వాదాలే దీనికి కారణంగా తెలుస్తున్నది. వైసీపీ నేతలు తరచుగా అధికారుల పనికి అడ్డు తగలడం.. నానీ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చిన ఒత్తిళ్ల కారణంగానే అధికారులు ఇప్పుడు ఇలా మొహం చాటేస్తున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. కాగా, ఒక మాజీ మంత్రి ఇలాకాలోనే , ఎమ్మెల్యేలు హాజరయ్యే సమావేశానికి అధికారులు మొహం చాటేస్తున్నారంటే రాష్ట్రంలో పాలన డొల్లతనం బయటపడుతున్నది. ఒక మాజీ మంత్రి, సొంత పార్టీ అధికారంలో ఉండగానే అధికారులు మాట వినడం లేదని సీఎం ఇంటి ముందు ధర్నాకు దిగుతా అని ప్రకటించారంటే ప్రభుత్వ తీరు ఎంద సుందరముదనష్టంగా ఉందో ఇట్టే అవగతమౌతుంది.
http://www.teluguone.com/news/content/perni-nani-warns-will-dharna-at-tadepalli-palace-39-158679.html





