జగనన్నపై జనంలో అసహనం.. ఎందుకంటే?
Publish Date:Apr 21, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ ప్రజలలో సంతుష్ట సూచీని పెంచడానికి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చర్యలు తీసుకుంటే...సంతుష్టి సూచీ దిగజారడానికి జగన్ పాలన శతథా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తతం ఏపీలో ఏ వర్గమూ సంతోషంగా ఉన్నట్లు కనిపించదు. పాలనా తీరు కారణంగా సామాన్య జనం, బ్యూరోక్రాట్లు, రైతులు, ఉద్యోగులు ఇలా ఒకటేమిటి అన్ని వర్గాల వారూ అసంతృత్తితో ఉన్నారు. అసహనంతో రగిలిపోతున్నారు. ధరల బాదుడు ఉద్యోగులూ, సమాన్య ప్రజానీకం నెత్తిన గుదిబండగా మారితే...సీఎస్ స్థాయి అధికారి కూడా ముందస్తు అనుమతి లేకుండా సీఎం జగన్ ను కలిసే అవకాశం లేని పరిస్థితి బ్యూరోక్రాట్లలో అసంతృతి పేరుకుపోవడానికి కారణమౌతున్నది. ఇక రైతుల పరిస్థితి తీసుకుంటే పండించిన పంట కొనుగోళ్లకు సర్కార్ ముందుకు రాకపోవడం, రైతు భరోసా కేంద్రాలు భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. విద్యుత్ చార్జీల పెరుగుదల అన్ని వర్గాల వారికీ షాక్ కొట్టేలా ఉంది. దేశంలో మిగిలిన ఏ రాష్ట్రం కంటే కూడా రాష్ట్రంలో పెట్రోలు ధరలు అధికంగా ఉన్నాయి. ఇక ఉద్యోగులు మూడేళ్ల కిందటి వరకూ అంటే జగన్ అధికార పగ్గాలు చేపట్టేంత వరకూ ప్రతి నెలా మొదటి తారీకున జీతాలు అందేవి. ఇప్పుడవి ఎప్పుడు అందుతాయన్న విషయం స్పష్టంగా చెప్పగల నాథుడే లేని పరిస్థితి ఏర్పడింది. ఇక పీఆర్సీ విషయంలో జగన్ సర్కార్ తీరు కారణంగా మోసపోయామన్న అసంతృప్తి ఉద్యోగులలో కొనసాగుతూనే ఉంది.
వీటికి తోడు జగన్ మానస పుత్రికగా చెప్పుకునే వలంటీర్ వ్యవస్థ ప్రజలపై పెత్తనం చేసే మరో అధికార కేంద్రంగా తయారైంది. గ్రామ స్థాయిలో వారు చేసే దాష్టీకం ప్రభుత్వంపై అసంతృప్తి స్థాయిని పెంచేల ఉంది.
ఇక జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఉచిత పథకాలు అందుకుంటున్న వారు కూడా సంతోషంగా లేరు. ఒక వైపు ఖాతాలలో సొమ్ములు పడుతున్నా....నిత్యావసరాల ధరలన్నీ కొండెక్కిన పరిస్థితుల్లో ప్రభుత్వం ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకుంటున్నదన్న భావన వారిలో కూడా అసంతృప్తి గూడు కట్టుకోవడానికి కారణమౌతోంది.
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రహసనం పార్టీలో అసమ్మతి ఎంతటి స్థాయిలో ఉందో తేటతెల్లం చేసేసింది.
ఇలా అన్ని వైపులా రాష్ట్రంలో అసహనం, అసంతృప్తి ఉన్న పరిస్థితిలో విపక్షాలు క్రియాశీలం అయితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే విపక్షాలు ఆ దిశగా దృష్టి పెడుతున్నట్లుగా కనిపించదు.
http://www.teluguone.com/news/content/people-impatient-on-jagan-rulewhy-25-134755.html