బీఆర్ఎస్ దీక్షా దివస్ కు జనం దూరం.. కారణమేంటో తెలుసా?
Publish Date:Nov 30, 2024
Advertisement
తెలంగాణలో అధికారంలో ఉన్న పదేళ్లలో ఎన్నడూ తలవనైనా తలవని దీక్షా దివస్ కు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత ఎక్కడ లేని ప్రాధాన్యతా ఇచ్చింది. పదేళ్ల అధికారంలో ఉన్నా తెలంగాణ సాధన కోసం సావు నోట్లో కేసీఆర్ తలపెట్టిన రోజును మాత్రం ఎన్నడూ పెద్దగా స్మరించుకోలేదు. అయితే ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కారణమైన తెలంగాణ ఆత్మను కూడా పార్టీలో లేకుండా చేసిన తరువాత.. ఔను రాష్ట్రంలో రెండో సారి అధికార పగ్గాలు అందుకున్న తరువాత కేసీఆర్ తెలంగాణ వాదాన్ని వదిలేశారు. జాతీయ రాజకీయాలపై మక్కువ పెంచుకుని ఢిల్లీ పీఠంపై కన్నేసి పార్టీ పేరులోంచి తెలంగాణను తీసేశారు. తెలంగాణ సాధన కోసం 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం సాగించిన టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చేశారు. ఆ మార్పుతోనే తెలంగాణ వాదంతో ఉన్న అనుబంధం పుటుక్కున తెగిపోయింది. బీఆర్ఎస్ పేరుతో ఎన్నికలకు వెళ్లి అధికారాన్ని కోల్పోయింది. ఇప్పుడు విపక్ష పాత్రలో కూడా ఆ పార్టీ అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోతోంది. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ గతంలో చేసిన త్యాగాలు, పోరాటాలను ప్రజలకు గుర్తు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సాధన కోసం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన నవంబర్ 19వ తేదీని దీక్షా దివస్ పేర ఘనంగా నిర్వహించింది. రాష్ట్రం నలుమూలలా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు, అమర వీరుల స్మారక చిహ్నాల వద్ద సభలు, సమావేశాలు ర్యాలీలు, ప్రార్థనలతో హడావుడి చేశారు. కరీంనగర్‌లోని అలుగునూరులో జరిగిన సమావేశంలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొన్నారు. సిద్దిపేటలో పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రని హరీశ్ రావు పాల్గొన్నారు. ఇక గత కొన్ని నెలలుగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న ఎమ్మెల్సీ కవిత కూడా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన దీక్షా దివస్ కార్యక్రమంలో పాగ్లొన్నారు. ర్యాలీలోనూ కనిపించారు. ఇంత వరకూ బానే ఉంది కానీ, నిజంగా ఈ కార్యక్రమానికి ప్రజలలో గుర్తింపు రావాలంటే ముఖ్యనేత, పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ సాధన కోసం సావు నోట్లో తలపెట్టి వచ్చానని చెప్పుకునే కేసీఆర్ పాల్గొనాలి. కానీ ఆయన ఎక్కడా కనిపించలేదు. ఫామ్ హౌస్ వదిలి బయటకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ దీక్షా దివస్ అంటూ ఎంతగా హంగామా చేసినా జనం పెద్దగా పట్టించుకోలేదు. అది పూర్తిగా ప్రజలకు సంబంధం లేని పార్టీ కార్యక్రమంగా మిగిలిపోయింది.
http://www.teluguone.com/news/content/people-distance-from-brs-deeksha-divas-39-189257.html