పొగాకు రైతులను ఆదుకుంటాం.. బోగాపురం చంద్రబాబు విజన్ వల్లే సాకారం.. పెమ్మసాని.!
Publish Date:Aug 3, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నాయని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. పొగాకు రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు ఎంపీలతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రైతుల ప్రయోజనాలే పరమావధిగా కీలక నిర్ణయాలు తీసుకున్నామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో ఈ సీజన్లో 140 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి అనుమతి ఉండగా, రైతులు వివిధ కారణాల వల్ల దాదాపు 240 మిలియన్ కిలోల వరకు పండించారని కేంద్రమంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, అధిక ఉత్పత్తి కారణంగా ధరలు క్షీణించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులను ఆదుకోవడానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున బోర్డు పరిధిలోని ప్రతి పొగాకు రైతుకు (45 వేల బాండ్లకు) రెండేళ్ల కాలపరిమితితో 50 వేల రూపాయల వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్న పెమ్మసాని.. దీని ద్వారా సుమారు 250 కోట్ల నిధులు రైతులకు అందుబాటులోకి రానున్నాయన్నారు. అదేవిధంగా, లో గ్రేడ్, ఆఫ్ స్టైల్ పొగాకుకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం కిలోకు 10 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుందని.. దీనికోసం రాష్ట్ర బడ్జెట్ నుండి 100 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. మరోవైపు పొగాకు కొనుగోలుదారులతో చర్చలు జరిపి కనీస మద్దతు ధరలు ఖరారు చేశామని పెమ్మసాని వివరించారు. బ్రైట్ గ్రేడ్‌కు 230 రూపాయలు, మీడియంకు 190, లో-గ్రేడ్‌కు 110, ఆఫ్ స్టైల్‌కు 130 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేసేందుకు ఎగుమతిదారులు అంగీకరించారని పెమ్మసాని చెప్పారు. ఈ వేలం ప్రక్రియను రోజుకు 2 మిలియన్ కిలోల చొప్పున రాబోయే రెండు నెలల్లో వేగంగా పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించామన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కేవలం ఒకే ఒక్కసారి 105 కోట్ల రూపాయలతో మార్కెట్ జోక్యం చేసుకుంటే, తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే బ్లాక్ బర్లీ రైతులకు 146 కోట్లు ఇచ్చిందని గుర్తు చేసిన పెమ్మసాని.. ఇప్పుడు మళ్లీ 100 కోట్ల రూపాయల సాయం అందిస్తూ రైతు పక్షాన నిలిచామని చెప్పారు. ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్‌పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు. అయితే గతంలో జగన్ కోర్టు కేసులు వేయించి, 500 ఎకరాల సేకరణను అడ్డుకుని ప్రాజెక్టును జాప్యం చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చాక జీఎంఆర్ టెండర్లను రీటెండర్ చేసినా నిబంధనలేవీ మారలేదని, కేవలం కాలయాపన చేసి ప్రాంతాభివృద్ధికి విఘాతం కలిగించారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేశారని పెమ్మసాని చంద్రశేఖర్ వివరించారు. ఇప్పటికే విశాఖ నుంచి ఎయిర్‌పోర్టుకు కనెక్టివిటీ కల్పించే ఐదు రహదారుల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రెండు రహదారులను కూడా త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. Pemmasani Chandrasekhar, Tobacco Farmers AP, Bhogapuram Airport, AP Cabinet ReviewAP TDP Coalition News
http://www.teluguone.com/news/content/pemmasani-chandrasekhar-39-227878.html





