బాబు బాటలో పయ్యావుల.. సూపర్ బడ్జెట్
Publish Date:Feb 28, 2025
Advertisement
వంటను చూసి రుచి చెప్పడం కుదరదు. బడ్జెట్ విషయం కూడా అంతే. బడ్జెట్ కు ఈ సూత్రం వర్తిస్తుంది. వడ్డించగానే రుచులు చెప్పడం ఎలా అయితే అయ్యే పనికాదో, ఆర్థిక మంత్రి సభలో ప్రవేశపెట్టిన వెంటనే బడ్జెట్ బాగుందనో బాగా లేదనో చెప్పడం కుదరదు. అయితే, ఆదాయ, వ్యయ ప్రాధన్యతలు,నిధుల కేటాయింపులన బట్టి, బడ్జెట్ ఎలా వుందో కొంతవరకు విశ్లేషించ వచ్చును. అంచనా వేయ వచ్చును. ఆ విధంగా చూసినప్పుడు, ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025 -2026 వార్షిక బడ్జెట్ బాగుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్లోనే, తెలుగుదేశం వారసత్వాన్ని నిలబెట్టారు. చంద్రబాబు మార్క్ ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ, అభివృద్ధి, సంక్షేమం రెంటికీ సమ ప్రాధన్యత ఇచ్చారు. ఒక విధంగా చూస్తే, ఎన్నికల హామీల దృష్ట్యా కావచ్చును, సంక్షేమానికి ఒకింత ఎత్తు పీట వేశారు. అదే సమయంలో, గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనలో అన్ని విధాలా అణచివేతకు గురైన అన్నదాతను ఆదుకునేందుకు, వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యతా క్రమలో నిధులు కేటాయించారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి, రూ. 6, 300 రూపాయలు కేటాయించారు. ఆవిధంగా రైతులకు భరోసా ఇచ్చారు. అలాగే, ‘తల్లికి వందనం’ వంటి ఇతర పధకాలకు లోటు లేకుండా రూ. 9,407 కోట్ల రూపాయలు కేటాయిచారు. గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడి’ పథకం విషయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చాంతాడంత రాగం తీసి చివరకు అదేదో ... పాట పాడినట్లుగా తేల్చేశారు. ఆ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కావచ్చును, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్,కోతలు, మినహాయింపులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే 1-12వ తరగతుల విద్యార్ధులు అందరికీ తల్లికి వందనం పథకం వర్తింప చేశారు.విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను స్కూళ్లు తెరిచే నాటికి అమలు చేసేలా ప్రణాళికలు రూపొందించారు.తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీల సంక్షేమానికి, రూ.47,456 కోట్లు కేటాయించారు. కేటాయింపుల వరకు అయితే, వేలెత్తి చూపేందుకు పయ్యావుల ఎవరికీ ఆస్కారం ఇవ్వలేదు. అయితే,ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తమ ప్రసంగంలో పేర్కొన్నట్లుగా, దేశంలో అప్పు చేసే శక్తిలేని ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కావడం, విస్మరించలేని వాస్తవం. అంతే కాదు, గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎంతటి దుస్థితికి చేర్చిందో తెలియచేస్తున్న వాస్తవం. జగన్ రెడ్డి ఐదేళ్ళ పాటు అందిన కాడికి అప్పులు చేసి, ఇక అప్పులు పుట్టే అవకాశమే లేకుండా చేశారు. కొత్త అప్పులకు ఆస్కారం లేక పోవడమే కాదు, జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు,అసలు చెల్లింపుల భారం మోయడం సామాన్య మైన విషయం కాదు. నిజానికి ఇలాంటి పరిస్థితిలో బడ్జెట్ పరిమణాని రూ.3.22 లక్షల కోట్లకు పెంచడం ఒక విధంగా సాహసోపేత నిర్ణయమే. అయితే., ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలను అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ సాహసోపేత మైన నిర్ణయం తీసుకుంది అనుకోవచ్చును. అదే సమయంలో, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నట్లుగా ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు స్పూర్తితో రూపొందించిన ఈ ‘సూపర్’ బడ్జెట్ ‘సక్సెస్’ కు చంద్రబాబు శక్తి సామర్ధ్యాలే శ్రీరామ రక్ష. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ఆయనకున్న గుర్తింపు, గౌరవాలే రాష్ట్రాన్ని రక్షించే తారక మంత్రం.
http://www.teluguone.com/news/content/payyavula-budget-superb-39-193616.html





