స్థానిక పోరులో జనసేన వ్యూహం.. కూటమి ఐక్యతకు భంగం లేకుండానే ఎక్కువ స్థానాల్లో పోటీ.!
Publish Date:Aug 21, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ సీట్ల సర్దుబాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు ధర్మాన్ని కాపాడుకుంటూనే, జనసేన పార్టీకి తగిన ప్రాధాన్యం దక్కేలా సీట్ల పంపకాల వ్యూహాన్ని అమలు చేయాలని పవన్ నిర్ణయించారు. స్థానిక పోరుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చిన ఆయన.. కూటమి భాగస్వామ్య పక్షాలతో సీట్ల కేటాయింపు చర్చలను తానే స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. కూటమిలో సీట్ల పంపకాలపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ.. 80, 15, 5 నిష్పత్తిలో సీట్ల పంపకాల ప్రతిపాదన లేదన్నారు. 2024 ఎన్నికల సమయానికి.. , ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చిందన్న పవన్ కల్యాణ్.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమి ఐక్యత, రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా త్యాగాలకు సిద్ధపడ్డామన్న ఆయన.. క్షేత్రస్థాయిలో శ్రమించిన పార్టీ శ్రేణులకు, నాయకులకు ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పిస్తానన్నారు. స్థానిక ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేలా ముందుకుసాగుతానన్న ఆయన కూటమి ఐక్యతకు భంగం వాటిల్లకుండానే, అధిక స్థానాలలో జనసేన పోటీ చేసేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయి బలాబలాలు, అభ్యర్థుల గెలుపు అవకాశాలను పరిగణనలోనికి తీసుకునే స్థానిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు ఉంటుందని పవన్ చెప్పారు. Pawan Kalyan Strategy for local body elections, Janasena Party, AP Local Body Elections, TDP Janasena Alliance, Seat Sharing Strategy
http://www.teluguone.com/news/content/pawan-kalyan-strategy-for-local-body-elections-39-229418.html




