పవన్ పాలిటిక్స్ కి పనికి రాడు.. కేఏ పాల్
Publish Date:Jul 19, 2022
Advertisement
కేఏ పాల్ ఎప్పుడు ఎవరిని ఆకాశానికి ఎత్తేస్తారా, ఎవరిని ఎప్పుడు విమర్శలతో ముంచెత్తుతారో కనీసం ఆయనకైనా తెలుసా అన్న అనుమానం ఆయన మాటలు విన్న ఎవరికైనా కలగక మానదు. ఎవరేమనుకున్నా, ఎంతగా నవ్విపోతున్నా ఆయన తన బాణీని మార్చుకోరు. పూటకో అంశం, గంటకో సమస్యతో ఆయన మీడియా ముందుకు వచ్చి హాస్యాన్ని పండిస్తూనే ఉంటారు. ఒకే సమయంలో ఒకే వ్యక్తిని పొగడ్తలతో ముంచేయగలరు, విమర్శలతో చెరిగేయగలరు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్.. విమర్శలతో ఫైర్ అయిన నాయకుల జాబితాలో ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ కూడా చేరిపోయారు. పార్టీ పెట్టిన తరువాత ఇప్పటి వరకూ తొమ్మిది పార్టీలతో కలిసిన పవన్ కల్యాణ్ అసలురాజకీయాలకే పనికి రాడని కేఏపాల్ అభిప్రాయపడ్డారు. పునర్విభజన చట్టంలోని హామీల అమలు డిమాండ్ తో బుధవారం (జులై20)న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధీక్ష నిర్వహించనున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడుకేఏ పాల్ఆ సందర్భంగా మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఒక వైపు పవన్ రాజకీయాలకు పనికి రాడని విమర్శిస్తూనే తన దీక్షకు జనసేన మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే నిన్న మొన్నటి వరకూ కేసీఆర్ పై విమర్శలతో చెలరేగిపోయిన పాల్ ఇప్పుడు తన దీక్షకు మద్దతు ఇవ్వాల్సిందిగా అదే కేసీఆర్ ను మీడియా ముఖంగా కోరారు. అలాగే ఏపీలో అధికార పార్టీ, విపక్ష పార్టీల మద్దతునూ కోరారు. మద్దతు కోరుతూనే కేసీఆర్ క్లౌడ్ బరస్ట్ వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. అయితే ఈ మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్, పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వాన్నీ, ఏపీలో జగన్ ప్రభుత్వాన్నీ కూడా విడిచి పెట్టలేదు. పవన్ కల్యాణ్ ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే అప్పులు చేస్తూ మందుకువెళితే రాష్ట్రాలు శ్రీలంకలా మారిపోవడం ఖాయమన్నారు. అలాగే కేంద్రం అప్పులపై కూడా ఆయన ధ్వజమెత్తారు. దేశాన్ని శ్రీలంక, వెనిజులా బాటలో మోడీ నడిపిస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో తాను గ్లోబల్ సమ్మిట్ పెడతానంటే దానిని గుజరాత్‌లో పెట్టాలంటూ బీజేపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారన్నారు. ఆగస్టు 15వ తేదీలోగా పునర్విభజన చట్టంలోని హామీలు నెరవేర్చకుంటే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-not-fit-for-politics-says-paul-39-140042.html





