తెలంగాణ మునిసిపోల్స్.. ప్రచారానికి పవన్ దూరం
Publish Date:Feb 7, 2026
Advertisement
తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో పవన్ కల్యాణ్ ప్రచారానికి దూరంగా ఉండనున్నారు. ఆయన బీజేపీ తరఫున తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో ప్రచారం చేయడానికి షెడ్యూల్ కూడా ఖరారైన సంగతి తెలిసిందే. అయితే అనివార్య కారణాలతో ఆయన ప్రచార కార్యక్రమం రద్దైనట్లు జనసేన ప్రకటించింది. తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో జనసేన పోటీ చేయడానికి నిర్ణయించుకున్న తరువాత.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, కేంద్ర మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కిషన్ రెడ్డిలు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆ భేటీలో వారు తెలంగాణ మునిసిపోల్స్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారి కోరిక మన్నించి తెలంగాణ మునిసిపోల్స్ లో కమలం పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడానికి పవన్ అంగీకరించారు. అయితే అప్పటికే నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రంగంలో ఉన్న జనసేన అభ్యర్థుల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం వల్ల జనసేన అభ్యర్థుల పరిస్థితి గందరగోళంలో పడుతుందన్న చర్చ జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ పురపోరులో పవన్ ప్రచారం చేయరని జనసేన క్లారిటీ ఇచ్చింది. ఇలా ఉండగా తెలంగాణ మునిసిపల్ ఎన్నికలలో మొత్తం 363 వార్డులలో జనసేన అభ్యర్థులు రంగంలో ఉన్నారు. వీరంతా కూడా గాజుగ్లాసు గుర్తుపై పోటీ చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/pawan-kalyan-campaign-in-telangana-municipal-polls-canciled-39-213657.html





