"నా దగ్గర గన్ ఉంది" ఎయిర్ పోర్ట్‌లో ప్రయాణికుడి హల్‌చల్..!
Publish Date:Jul 19, 2026
Advertisement
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. హుబ్లీకి వెళ్లాల్సిన 591 ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించేందుకు వచ్చిన వ్యక్తి, బోర్డింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రయాణికులను విమానం వద్దకు తీసుకెళ్తున్న బస్సులో ఎక్కాడు. ఈ సమయంలో ఏదో విషయంపై ఎయిర్‌వేస్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగాడు. వాగ్వివాదం జరుగుతుండగానే ఒక్కసారిగా "నా దగ్గర గన్ ఉంది... జాగ్రత్త" అంటూ వ్యాఖ్యానించడంతో అక్కడున్న సిబ్బంది, ఇతర ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. విమానాశ్రయ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో ఎయిర్‌వేస్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమై వెంటనే భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం అతడిని శంషాబాద్ ఎయిర్‌పోర్టు అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు. అతడు చేసిన వ్యాఖ్య నిజమేనా? అతని వద్ద నిజంగా ఏదైనా ఆయుధం ఉందా? లేక కోపోద్రిక్తతలో అలాంటి మాటలు మాట్లాడాడా? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రయాణికుడి చర్యలపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశముంది. Passenger hustle and bustle at Shamshabad Airport, Rajiv Gandhi International Airport, Hubli.airways
http://www.teluguone.com/news/content/passenger-hustle-and-bustle-at-shamshabad-airport-36-226448.html





