కేంద్రానికి విత్త మంత్రి భర్త షాక్: బొద్దింకలకు మద్దతు ప్రకటించిన పరకారల ప్రభాకర్.!
Publish Date:Oct 21, 2026
Advertisement
భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవడానికి, లేదా అణచివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ చేయగలిగినంతా చేస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలను అరెస్టు చేయడం, అలాగే మొదటి దశ నిరసనను అణచివేయడంలో కేంద్రం ఒకింత సక్సెస్ అయ్యింది కూడా. వరుస అరెస్టులు కేసులతో బొద్దింకల పార్టీ ఓ మెట్టు దిగి.. దీపావళి తరువాత వరకూ ఉద్యమానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. కానీ అంతలోనే మళ్లీ శుక్రవారం (అక్టోబర్23) నిరసనకు పిలుపునిచ్చారు. అది పక్కన పెడితే.. కాక్రోచ్ ఉద్యమానికి పరకాల ప్రభాకర్ బహిరంగంగా మద్దతు తెలపడం ద్వారా కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారు. ఇంతకీ ఈ పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు. కేంద్ర విత్త మంత్రి భర్త, ప్రముఖ ఆర్థిక వేత్త అయిన పరకాల ప్రభాకర్, ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 23న జరగనున్న బొద్దింకల నిరసనలో పాల్గొంటానని ప్రకటించడం ద్వారా కేంద్రాన్ని డిఫెన్స్ లోకి నెట్టేశారు. ఎన్నిక అక్రమాలు, ఈవీఎం నిర్వహణలో అవకతవకలపై పరకాల ప్రభాకర్ గత కొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి విదితమే. కేంద్ర ప్రభుత్వంలో కీలక బాధ్యతల్లో ఉన్న నిర్మలా సీతారామన్ భర్తే ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా నిరసనలో పాల్గొనడం కేంద్రానికి మింగుడుపడటం లేదు. శుక్రవారం (అక్టోబర్ 23) జరగనున్న బొద్దింకల నిరసనలో కేంద్ర విత్త మంత్రి భర్త పరాకాల ప్రభాకర్‌తో పాటు నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాశ్ రాజ్, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్, రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ తదితరులు పాల్గొంటున్నారు. అసలింతకీ సర్ విషయంలో పరకాల ప్రభాకర్ గత కొంత కాలంగా తన అభ్యంతరాలను బాహాటంగానే వెల్లడిస్తూ వస్తున్నారు. ఓటర్ల జాబితా నుంచి అర్హుల పేర్లను కూడా తొలగిస్తున్నారంటూ ఆయన ఇప్పటికే పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగిన వారు తమ హక్కుల కోసం సంఘటితంగా పోరాడాలని కూడా ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఇప్పుడీ ఆందోళనలో ప్రత్యక్షంగా పొల్గొనేందుకు సిద్ధపడటం ద్వారా కేంద్రంపై ఒత్తిడిని మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. పరకాల ప్రభాకర్ బొద్దింకల ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొంటున్నట్లు ప్రకటించడం విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు నిస్సందేహంగా ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అది పక్కన పెడితే.. విధానాల పరంగా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ ల అభిప్రాయాలు వేరు వేరు అన్న సంగతి గతంలో కూడా పలు సందర్భాలలో బయటపడింది. నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రిగా తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలను గతంలో కూడా పరకాల ప్రభాకర్ పలు మార్లు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలు, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై పలు మార్లు ఘాటు విమర్శలు చేశారు. మరీ ముఖ్యంగా ఆయన రచించిన ది క్రూకడ్ టింబర్ ఆఫ్ న్యూ ఇండియా ( The Crooked Timber of New India) పుస్తకంలోనూ కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనను బాహాటంగా మద్దతు ఇవ్వడం ద్వారా ఆయన కేంద్రానికి బిగ్ షాక్ ఇచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. [Parakala Prabhakar Join CJP Protests, Union Minister Nirmala Sitharaman Husband, SIR Protest, Gyanesh Kumar,Resign Demand, Shock, Center, Telugu One]
http://www.teluguone.com/news/content/parakala-prabhakar-join-cjp-protests-25-234994.html





