Sean Stephenson – ఇతను మూడడుగుల బుల్లెట్
Publish Date:May 16, 2017
Advertisement
మే 5, 1979. ఆ పిల్లవాడు పుడుతూనే అతని ఎముకలన్నీ విరిగిపోయాయి. అతనికి Osteogenesis imperfect అనే అరుదైన వ్యాధి ఉందనీ... అతను బహుశా మరో 24 గంటలు మించి బతకడనీ తేల్చేశారు వైద్యులు. పదిహేను వేల మందిలో ఒక్కరికే వచ్చే ఆ మాయదారి జబ్బుతో ఒకవేళ పిల్లవాడు బతికినా, అతని జీవితం వృధా అని హెచ్చరించారు. ఆ పిల్లవాడి పేరే sean Stephenson. Osteogenesis వ్యాధి వచ్చినవారి ఎముకలు మహా బలహీనంగా మారిపోతాయి. అవి ఎక్కడికక్కడ వంగిపోయి, విరిగిపోతాయి. దానికి తోడు ఆ వ్యాధి ఉన్నవారు పెద్దగా ఎత్తు ఎదగరు. వారి కీళ్లన్నీ సడలిపోయి ఉంటాయి. ఊపిరితిత్తులు, వినికిడి సమస్యలు కూడా ఏర్పడతాయి. పళ్లు త్వరగా ఊడిపోతాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ వ్యాధి ఉన్నవారు బతికినా కూడా చక్రాల కుర్చీకి అంకితమైపోయి జీవచ్ఛవంలా ఉండాల్సిందే. కానీ sean Stephenson జీవచ్ఛవంలా బతుకుతూనే ఇతరుల జీవితాల్లో వెలుగు నింపుతున్నాడు. ‘మన జీవితం వృధా అని చెప్పే హెచ్చరికని ఎప్పుడూ నమ్మకూడదు. నేను అలా నమ్మలేదు కాబట్టే... ఆనాడు నేను చనిపోతానని చెప్పిన డాక్టర్లంతా చనిపోయారేమో కానీ, నేను మాత్రం ఇంకా బతికే ఉన్నాను,’ అంటాడు సీన్. తనలోని ఆత్మవిశ్వాసమే అండగా బతకడమే కాదు... నలుగురికీ దారి చూపించే వ్యక్తిత్వ వికాస రంగాన్ని ఎంచుకున్నాడు. అందుకోసం అవసరమైన కోర్సులన్నీ చేశాడు. హిప్నోధెరపీలో డాక్టరేటుని కూడా అందుకున్నాడు. సీన్కి వచ్చిన వ్యాధి వల్ల అతని జీవితం నిజంగా నరకప్రాయంగానే ఉండేది. ఎముకలు విరిగిపోకుండా అతనిలోకి ఇనుపరాడ్లను చొప్పించారు. పళ్లన్నీ విరిగిపోయాయి. తనంతట తానుగా స్నానం కూడా చేయలేడు. కానీ శరీరానికి వచ్చిన వైకల్యంకంటే పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోవడమే నిజమైన వైకల్యం అంటాడు సీన్. అలా సీన్ ఉపన్యాసాల ద్వారా, అతని పుస్తకాల ద్వారా లక్షలాదిమంది జీవితం మీద కొత్త ఆశలను ఏర్పరుచుకున్నారు. అతని ప్రతిభని గుర్తించి బయోగ్రఫీ ఛానల్ Three Foot Giant ఒక డాక్యుమెంటరీనే రూపొందించింది. సీన్ పరిస్థితి చూసి చాలామంది తెగ జాలిపడిపోతూ ఉంటారు. కానీ అవతలివారిని చూసి కానీ, తనని తాను చూసుకుని కానీ జాలిపడటం అంత పనికిమాలిన విషయం మరొకటి లేదన్నది సీన్ నమ్మకం. ‘నేను పనికిమాలినవాడిని, ఏమీ చేయలేను, ఏదీ సాధించలేను,’ అని తనని తాను వేధించుకోవడం నేరమన్నది అతని వాదన. సీన్ అందమైన వ్యక్తిత్వాన్ని చూసి Mindie Kniss అనే అందగత్తు తన మనసు పారేసుకుంది. 2012లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. సీన్తో తన జీవితం చాలా అద్భుతంగా గడిచిపోతోందని మిండెల్ తరచూ చెబుతుంటుంది. సీన్ వ్యక్తిత్వం నానాటికీ బలపడుతూ ఉండవచ్చు. కానీ అతనిలో దాగిన వ్యాధి మాత్రం ఎప్పటికప్పుడు తన పంజా విసురుతూనే ఉంది. ఆ వ్యాధి కారణంగానే గత ఏడాది సీన్ తన మాట కూడా పోగొట్టుకున్నాడు. అయినా తన రాతల ద్వారా ఇతరులలో జీవితం పట్ల కసిని రగిలిస్తూనే ఉన్నాడు. తన మాట పోయిన తర్వాత 2 Minutes with Sean పేరుతో తన ఫేస్బుక్లో అతను చేసిన పోస్టే ఇందుకు ఉదాహరణ. ‘మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి’ అన్న సందేశంతో ఇచ్చిన ఈ పోస్టుని దాదాపు ఏడుకోట్ల మంది చూశారు. ఇంతకీ సీన్కి తన మీద ఇంత నమ్మకం ఎలా సాధ్యం? అన్న అనుమానం రాకమానదు. ఆ ప్రశ్నకి కూడా సీన్ దగ్గర సమాధానం ఉంది. ‘ఈ లోకంలో అన్నిటికంటే పెద్ద జైలు మన మెదడే! ఆ మెదడుకి కనుక స్వేచ్ఛని అందించగలిగితే... లెక్కలేనన్ని దారులు కనిపిస్తాయి’ అంటారు. నిజమే కదా! - నిర్జర.
http://www.teluguone.com/news/content/osteogenesis-imperfect-35-74773.html





