ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఆన్లైన్ రమ్మీ, పోకర్ పై నిషేధం
Publish Date:Sep 3, 2020
Advertisement
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి బెట్టింగ్ గేమ్స్ పై నిషేధం విధిస్తూ ఏపీ గేమింగ్ యాక్ట్–1974 సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్లు జైలు శిక్ష విధించాలని.. ఆన్లైన్ జూదం ఆడేవాళ్ళు పట్టుబడితే 6 నెలల జైలు విధించాలంటూ ఏపీ కేబినెట్ నిర్ణయించింది. వైఎస్సార్ ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవోకి కేబినెట్ ఆమోదం తెలిపింది. కృష్ణా జిల్లాలో ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన మరో రెండు కొత్త బ్యారేజీలు నిర్మాణ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.15380 కోట్లతో బాబు జగజ్జీవన్‌రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఫేజ్–2 నిర్మాణ ప్రతిపాదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరితగతిన పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గుంటూరు జిల్లా బాపట్లలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదించింది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయిస్తూ తీసుకున్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఏపీ ఫిషరీస్ ఆర్డినెన్స్–2020ను కేబినెట్ ఆమోదించింది.
http://www.teluguone.com/news/content/online-rummy-and-poker-banned-in-ap-39-103629.html





