16/8 డైట్ అంటే ఏంటి?
Publish Date:Oct 30, 2020
Advertisement
ఇప్పుడు ఎవర్ని చూసినా ఒబెసిటీతోనే బాధపడుతున్నారు. దాంతో పాటే వచ్చే డయాబెటిస్, గుండెపోటులాంటి సమస్యలూ ప్రతి ఇంట్లోనూ కనిపిస్తున్నాయి. శరీర శ్రమ లేని లైఫ్ స్టైల్, ఏదిపడితే అది ఎడాపెడా తినేయడం మన ఒబెసిటీకి కారణం అని చిన్నిపిల్లాడికి కూడా తెలుసు. కానీ ఏం చేయలేని పరిస్థితి. అందుకే దీన్ని నివారించడానికి అప్పుడప్పుడూ రకరకాల చిట్కాలు వినిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒకటైన 16/8 డైట్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతోంది. ఆ 16/8 డైట్ కథ ఏంటో మీరే చూడండి... ఒకప్పుడు తిండి తినడానికి కూడా సమయం ఉండేది. రాత్రి చీకటిపడేలోగా తినేసి పక్కల మీదకి చేరేవాళ్లు. కానీ ఇప్పుడు అలా కాదు! పొద్దన్న ఆరింటికి మొదలుపెడితే రాత్రి పదకొండు గంటల వరకూ పొట్టలో ఏదో ఒకటి పడుతూ ఉండాల్సిందే! దీనికి విరుగుడుగానే 16/8 డైట్‌ని కనిపెట్టారు. ఇది పాటించేవాళ్లు రోజులో 8 గంటల వ్యవధిలో మాత్రమే ఆహారం తీసుకోవాలి. మిగతా 16 గంటలూ కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఉదాహరణకు మన తిండి అంతా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల లోపే ముగించేయాలి. మర్నాడు ఉదయం పదిగంటల వరకూ ఎలాంటి ఆహారమూ తీసుకోకూడదు. మిగతా సమయంలో శరీరం నీరసించిపోకుండా ఉండేందుకు షుగర్ ఉండని లిక్విడ్స్ (నీళ్లు, బ్లాక్ టీ, నిమ్మరసం...) తీసుకోవచ్చు. ఈ 16/8 డైట్‌లో మిగతా 16 గంటలూ ఎలాంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల, శరీరం ఒంట్లో పేరుకున్న కొవ్వుని కరిగించడం మొదలుపెడుతుంది. ఓ మూడు నెలల పాటు ఈ పద్ధతిని పాటించినవాళ్లలో ఒబెసిటీ తగ్గినట్లు, బీపీ కూడా అదుపులో ఉన్నట్లు తేలింది. వినడానికి ఈ పద్ధతి బాగానే ఉంది. పాటించడానికి తేలికగా కూడా ఉంది. కానీ ఎవరు పడితే వాళ్లు ఈ డైట్ ఫాలో అయ్యేందుకు సిద్ధపడితే మాత్రం ప్రమాదం తప్పదు. షుగర్, గ్యాస్ట్రిక్ లాంటి సమస్యలు ఉన్నవారు దీని జోలికి పోకపోవడమే బెటర్. ఏదన్నా తిని మందులు వేసుకోవాల్సినవాళ్లు, డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకి కూడా ఈ పద్ధతి సరిపడదని చెబుతున్నారు. మిగతావాళ్లు మాత్రం అలా ఓసారి ఈ పద్ధతిని పాటించి చూడవచ్చునట. మరెందుకాలస్యం... ఓ రాయి వేయండి. ఏమో ఎవరికి తెలుసు- ఏ పుట్టలో ఏ రాయి ఉందో! https://www.youtube.com/watch?v=UFOfu35n7l8 - నిర్జర.
http://www.teluguone.com/news/content/obesity--34-82771.html