హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు
Publish Date:May 19, 2023
Advertisement
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి, శక పురుషుడు నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు శనివారం (మే 30) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా జరగనున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలకు హైదరాబాద్ కూకట్‌పల్లిలోని కైతలాపూర్ మైదానం వేదిక కానుంది. ఈ వేడుకలకు టాలీవుడ్ అగ్రహీరోలు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, వెంకటేష్, ప్రభాస్, అల్లు అర్జున్, కల్యాణ్ రామ్, సుమన్, మురళీ మోహన్, జయప్రద, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నిర్మాతలు జి. ఆదిశేషగిరిరావు, సి. అశ్వనీదత్ తదితరులు పాల్గొనున్నారు. అలాగే హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీపీఎం కార్యదర్శి సీతారామ్ ఏచూరి, దగ్గుబాటి పురందీశ్వరి తదితరులు హాజరుకానున్నారు. ఇక వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ సభకు తరలి రానున్నారు. ఇప్పటికే నిర్వహాణ కమిటీ పేరు పేరునా అందరినీ ఆహ్వానించింది. ఇక ఈ వేడుకలకు అటు నందమూరి ఫ్యామిలీ, ఇటు నారా ఫ్యామిలీ సైతం హాజరుకానుందని తెలుస్తోంది. ఈ వేడుకల్లో ఎన్టీఆర్ సమగ్ర సినీ, రాజకీయ జీవితంపై ప్రత్యేకంగా రాసిన వ్యాసాల సంకలనం.. శక పురుషుడు ప్రత్యేక సావనీర్‌తోపాటు ఎన్టీఆర్ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినిమా పాటలు, సినిమాలు.. అలాగే ఆయన ఉపన్యాసాలతో కూడిన సమగ్ర సమాచారంతో రూపొందించిన జై ఎన్టీఆర్ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించనున్నారు. ఎన్టీఆర్ శత జయంతి తొలి సభను విజయవాడ నగరంలో నిర్వహించారు. ఈ సభకు ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండో సభను హైదరాబాద్ మహానగరంలో నిర్వహిస్తున్నారు. ఇక మే 28వ తేదీ కథనాయకుడు పస్ల్ మహానాయకుడి జయంతి. ఆ రోజుతో ఆ యుగ పురుషుడి శతజయంతి వేడుకలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మే 27వ తేదీన రాజమహేంద్రవరంలో పసుపు పార్టీ పండుగ మహానాడు ప్రారంభం కానుంది. ఆ మరునాడు ఆ శక పురుషుడి శత జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించనుంది. అందుకు సంబంధించిన పనులకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో మహానాడు నిర్వహాణ పనులు వాయువేగంగా సాగుతోన్నాయి. ఈ సభకు లక్షలాది మంది ఎన్టీఆర్ అభిమానులు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విధేశాల నుంచి తరలిరానున్నారు. అందుకు తగ్గట్లుగా తెలుగుదేశం పార్టీ ఏర్పాట్లను ఘనంగా చేస్తోంది.
http://www.teluguone.com/news/content/ntr-centinary-celebrations-in-hyderabad-25-155615.html





