ఆకలి కావడం లేదా?? అయితే ఇదిగో పరిష్కారాలు..
Publish Date:Feb 10, 2023
Advertisement
మనిషిని నిత్యం వేధించే సమస్య ఆకలి. ఇది పూట పూటకు పుడుతుంది. దాన్ని తృప్తి పరచకపోతే మనిషి శరీరాన్ని బాధకు గురిచేస్తుంది. అయితే కొందరిలో ఈ ఆకలి అధికంగా ఉంటుంది. ఎంత తిన్నా కొద్దిసేపటికే ఆకలి మొదలవుతుంది. దీనివల్ల అధికబరువు, మధుమేహం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. ఇకపోతే ఆకలి లేకపోవడం అనేది మనుషుల్ని హింసించే సమస్య. ఇలా ఆకలి లేకపోవడం వల్ల శరీరానికి తగినంత శక్తి, పోషకాలు, అవసరమైన విటమిన్లు మొదలైనవి లభించక పోషకాహార లోపంతోను, బలహీనత తోనూ ఇబ్బంది పడతారు. భోజనానికి అరగంట ముందుగా కొద్దిగా అల్లం రసం తాగితే బాగుంటుంది, ఒకవేళ అల్లం అందుబాటులో లేకపోతే వాము కొద్దిగా నమలి తిన్నా మంచి ప్రయోజనమే. ఇవి రెండూ ఆకలిని పెంచుతాయి. అలాగే జీర్ణాశయాన్ని శుద్ధి చేస్తాయి. ఏ అనారోగ్యం వచ్చినా, ఏ డాక్టర్ దగ్గరకు వెళ్లినా, మన పెద్దలు అయినా చెప్పేది ఒకే మాట. సమయానికి తినాలి అని. ఆకలి లేదు అని వంకతో ఆహారం తీసుకోవడం అస్తవ్యస్తం అయితే అది అలాగే అలవాటుగా మారిపోయి జీర్ణశయాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. అలాగే ఆకలి లేకపోయినా.. సమయాన్ని చూసుకుని అధికంగా పొట్టలోకి వేయకూడదు. మితంగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఆకలికి అదే ఒక మంచి ఔషధంగా మారుతుంది. పై జాగ్రత్తలతో పాటుగా.... అవసరమైతే వైద్య సల హాల ప్రకారము జీర్ణశక్తికి ఉపకరించే కొన్ని “టానిక్స్” వాడవచ్చు. ఆకలి దగ్గర మాత్రం నిర్లక్ష్యం చేయకండి.
ఆకలి తగ్గిపోవడం అనే సమస్య రావడానికి అనేక కారణాలతో ఉంటాయి. ఫ్యాట్స్ ఎక్కువగా వున్న ఆహారపదార్ధాలను అతిగా తినడం, ప్యాక్ చేసిన పదార్థాలు, రెడి టూ ఈట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ మొదలైనవి తీసుకోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. అలాగే కొన్ని జీర్ణాశయ, జీర్ణవాహికల వ్యాధులలోనూ ఆకలి లేక పోవచ్చును. కాబట్టి "ఆకలిలేదు!” అని అనుకొనేవారు. ముందుగా అన్ని వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఏదైనా వ్యాధి ఉన్నట్టు నిర్ధారణ అయితే వైద్యుల సూచనల ప్రకారం ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎలాంటి వ్యాధి లేదని నిర్ధారణ అయితే ఆహారం తీసుకోవడం, లైఫ్ స్టైల్ వంటి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
చాలమందికి టీ.. కాఫీ.. లాంటివి గంటకు ఒకసారి, పూటకు ఒకసారి తీసుకోవడం బాగా అలవాటు. అలాంటి అలవాటు ఉన్నవారు దాన్ని తగ్గించుకోవాలి. అదేవిధంగా తీపి పదార్థాలు తినడం అంటే కొందరికి చెప్పలేనంత ఇష్టం. వాటిని కూడా తగ్గించుకోవాలి. ఇవి ఆకలి మీద చాలా దారుణమైన ప్రభావాన్ని చూపిస్తాయి. అలాగే జీర్ణాశయ గోడలను బలహీనం చేస్తాయి.
ఆహారంలో అన్నం ఎక్కువ ఉండకూడదు. అన్నం తక్కువ, పెరుగు, ఆకుకూరలు, కాయగూరలు, పీచుఎక్కువగావున్న పదార్థాలను అధికముగా తీసుకొంటూ ఉండాలి. ఇలా చేస్తే జీర్ణక్రియ బాగా జరుగుతుంది, ఆకలి కూడా సమయనికి తగ్గట్టు అవుతుంది.
వేపుడులు, మసాలా పదార్థాలు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవి, నూనె అధికంగా ఉన్నవి తీసుకోకూడదు. అవి జీర్ణాశయనికి చేటు చేస్తాయి.
◆నిశ్శబ్ద.
http://www.teluguone.com/news/content/not-hungry-34-151281.html





