బంగారు తల్లులు చితికిపోవాల్సిందేనా..??
Publish Date:Jun 6, 2022
Advertisement
ఇంటికి అందం ఆడపిల్లలు. ఆడపిల్లల్ని చదివించి పెద్ద పెద్ద వుద్యోగాల్లో చూసుకుంటూ ఆనందిస్తున్నారు తల్లిదండ్రలు. ఆడపిల్లలకుచదువులే ఆభరణంగా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ విషయం మరింత కీలకమయింది . ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియని కాలంలో పిల్లల్ని బయటికి పంపుతున్నారు. స్కూలుకి వెళ్లన పిల్లలు బడి ముచ్చట్లు, ట్యూషన్ విశేషాలు, వాళ్ల స్నేహితుల సరదా కబుర్లతో ఇల్లంతా సందడి చేసే రోజులు పోయాయి. ఇప్పడు అంతటా భయం భయం. ధైర్యంగా బడికి, కాలేజీకి, ఆఫీసులకు వెళుతున్నట్టు కనపడుతున్నారంతే! ఈ దురదృష్ట పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి అని ఆలోచించేకంటే పిల్లల రక్షణ విషయంలో తల్లిదండ్రులు, ప్రభుత్వాలు తీసుకునే జాగ్రత్తలే ప్రధానంగా మారాయి. ఇపుడు సమానత్వం భావనతోనే చదువు, ఆటల విషయాల్లో ఆడపిల్లల్ని ఎంతో ఉత్సాహపర్చడం మామూలయింది. కానీ వాళ్లు చాలా ప్రశాంతంగా, ఎలాంటి ఇబ్బందీ లేకుండా వుంటున్నారని గుండెమీద చేయి వేసుకుని చెప్పుకోగలిగిన తల్లిదండ్రుల శాతం బాగా తగ్గిందనే అనాలి. అమ్మాయికి ఆసక్తి వుందని గ్రహించి ఏ ఆటలోనో, మరేదో ప్రత్యేక శిక్షణలోనో చేర్పించితే ఆ పరంగా అభివృద్ధిలోకి వస్తారన్నది గొప్ప అభిప్రాయం. ఈ రోజుల్లో ఇది మరింత బలాన్ని సంతరించు కుంది. కానీ శిక్షణ పేరుతో, ప్రత్యేక క్లాసుల పేరుతో శిక్షణనిచ్చేవారు ఎలాంటి వారు అనే భయంతో కూడిన ప్రశ్న తల్లి వేసుకుంటూ బెంగగానే ఇంటిదగ్గర వుండటం కూడా జరుగుతోంది! అసలు ఆడపిల్లలు అనగానే కొంత చులకనా భావం కలగడం అనాదిగా వుంది. ఏడిపించడం అనేది మగాడి హక్కు , ఓ సరదా అని ఎవరో నూరిపోయక్కర్లేదు చుట్టుపక్కల వాతావరణం, ఇతరులను చూసే నేర్చుకుం టున్నారు. పూర్వం అదంతా సినిమాల ప్రభావం అనేవారు. ఇప్పుడు మొబైల్ ఫోన్‌ల ప్రభావం అంటు న్నారు. అర్ధంలేని స్నేహాలు, పిచ్చిమాటలు, ఆలోచనలు తొమ్మిదో తరగతిలోనే ఆరంభమవుతు న్నాయి. ఆనక మగపిల్లలు దానికి కాస్తంత కార్యరూపం ఇచ్చే ధైర్యం చేస్తున్నారు. ఇది ఏకంగా కొందరు టీచర్లు, డాక్టర్లు, సహాయకులు, ఆఖరికి ఆటో డ్రైవర్లు కూడా! వీళ్లందరి దృష్టీ ఒక్కటే వయసుతో నిమిత్తం లేదు. దుర్మార్గానికి పూనుకున్నప్పుడు ఎరగా కనిపించేవారి వయసుతో నిమిత్తం ఏముంటుంది? ఈ మధ్యనే 17 ఏళ్ల రొమేనియా అమ్మాయిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో కొందరు కుర్రాళ్లు కిడ్నాప్ చేసి కారులోనే రేప్ చేశారు. తల్లిదండ్రులు పోలీస్ కేసు పెట్టడానికి వెళితే పోలీసులు విచారించే సమ యంలో ఇది కాస్తంత హై ప్రొఫైల్ కేసు అన్నది అర్ధమయి జుత్తుపీక్కున్నారు. నిందితు ల్లో రాష్ట్ర మంత్రి మనవడు వున్నాడన్నది స్పష్టమయింది. ఈ కేసు అనేక ట్విస్ట్‌లు తిరుగుతోంది. అసలు నిందితులు వాడిన కారు వేరు, పోలీసులకు మరో ప్రాంతంలో దొరికిన కారు వేరు అని తేలింది. నిందితులు అమ్మాయిని ఎక్కించు కుని వేరే ప్రాంతానికి తీసికెళ్లిన కారు మంత్రి మనవడిది. అందువల్ల ప్రభుత్వం ఈ విషయంలో బాధ్యత వహించి కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజు రోజుకూ బలపడుతోంది. పబ్‌కి వెళ్ల లేదని ఒకసారి, ఆ కారు నాదే కానీ కొంత దూరం తర్వాత తాను వేరే కారులో ఇంటికి వెళ్లానని, అందువల్ల ఆ అఘాయిత్యానికి తనకూ సంబంధం లేదని సదరు హై ప్రాఫైల్ కుర్రాడి వాదన. ఏది ఏమయినప్పటికీ అతని స్నేహితులే ప్రధాన నిందితులుగా వున్నపుడు, పబ్ దగ్గరి కెమెరాలు చెప్పినది పరిశీలించాలన్నా రు విపక్ష నాయకులు. అందుకు భిన్నంగా కేసు నుంచి యత్నాలు బలంగా జరిగాయన్నది విపక్షాల ఆగ్రహం. మరి ఈ కేసు ఇంకా ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ఎంతమంది నిందితులుగా తేలనున్నారు, ఈ మొత్తం సీన్ నుంచి మంత్రిగారి మనవడిని ఈ కేసు నుంచి తప్పించడానికి ఇంకెన్ని ప్రయత్నాలు జరుగుతాయి.. వేచి చూడాల్సిందే. ఈ సంఘటన ఇంకా రాజకీయంగా, సామాజికంగా ప్రకంపనలు సృష్టిస్తున్నసమయంలోనే భాగ్యనగరంలోనే, అదీ విశ్వనగరంగా టీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నహైదరాబాద్ లో మరో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఒక బాలికను ఇంటి దగ్గర డ్రాప్‌చేస్తానని క్యాబ్ వాడు తీసికెళ్లి వాడి స్నేహితుడితో పాటు ఆమెపై అఘాయిత్యం చేసేడు. ఈ కేసులో నిందితులు కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్ షేక్ కలీం, మహ్మద్ యాజ్దానీలను అరెస్టు చేశారు. దేశంలోనే శాంతి భద్రతలు అత్యద్భుతంగా విలసిల్లుతున్నాయనీ, విరాజిల్లుతున్నాయనీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పక్క గప్పాలు కొట్టుకుంటుంటే.. బంగారు తల్లులు రక్షణ కరవై చితికి పోతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పబ్ లను నియంత్రించడానికి ఎటువంటి ప్రయత్నాలూ చేయకపోవడం, యథేచ్ఛగా పబ్ లలో మైనర్లకూ ప్రవేశం కల్పిస్తున్నా పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయన్నవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైనర్ లపై అత్యాచారాలను అరికట్టే విషయంలో పోలీసులు మరింత అప్రమత్తంగా, కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. హై ప్రొఫైల్ రేప్ కేసులో నిజమైన నిందిుతులను చట్టం ముందు ప్రవేశపెట్టి కఠిన శిక్షలు పడేలా, అదీ ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
http://www.teluguone.com/news/content/no-end-to-rapes-on-minors-25-137133.html





