మాజీ అయినా మారని గుడివాడ అమర్నాథ్ గుడ్డు కథ!
Publish Date:Jan 7, 2025
Advertisement
వైసీపీ హయాంలో కోడిగుడ్డు మంత్రిగా వెరీగుడ్డు నేమ్ సంపాదించుకున్నగుడివాడ అమర్నాథ్ అప్పట్లో చెప్పిన గుడ్డు కథనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జగన్ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా వెలగబెట్టిన గుడివాడ అమర్నాథ్.. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఏపీలో ఐటీ పరిశ్రమ అధోగతికి పడిపోయినా.. కొడిగుడ్డు కథ చెప్పి.. రాష్ట్రంలో ఐటీ అభివృద్ధికి సమయం పడుతుందంటూ సమర్ధించుకున్న తీరు అప్పట్లో ఆయనను నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేయడానికి మాత్రమే ఉపయోగపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్ ఐదేళ్ల పాలన అన్ని విధాలుగానూ అధోగతి పాలు చేసింది. విభజిత రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం విభజిత రాష్ట్ర తొలి ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వేసిన ప్రగతి బాటలను ఆ తరువాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీకి సైబరాబాద్ నిర్మాణం ద్వారా చంద్రబాబు బలమైన పునాది వేశారు. దాంతో ఐటీ రంగంలో లక్షలాదిమందికి ఉద్యోగాలు లభించాయి. ఐటి రంగంలో తెలుగు యువత అల్లుకుపోయి ప్రపంచ వ్యాప్తంగా దానిని శాశించే స్థాయికి ఎదిగింది. చంద్రబాబు వేసిన పునాదిపైనే హైదరాబాద్ అభివృద్ధిని ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు విస్తరిం చాయి. ఇప్పటికీ హైదరాబాద్ అభివృద్ధి గురించిన ప్రస్తావన వస్తే ముందుగా ఎవరైనా చంద్రబాబు పేరే చెబుతారు. అంత మాత్రాన చంద్రబాబు తరువాత అధికారం చేపట్టిన పార్టీలు, ముఖ్యమంత్రులు హైదరాబాద్ ను నిర్వీర్యం చేసి అభివృద్ధి ఆనవాలును తుడిచేయడానికి ప్రయత్నించలేదు. కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ ఉజ్వల భవిష్యత్ కోసం అమరావతి రాజధానిగా చంద్రబాబు వేసిన పునాదులను జగన్ సర్కార్ విధ్వంసం చేసింది. కేవలం చంద్రబాబుకు గుర్తింపు వస్తుంది. పేరు వస్తుంది. ఆయన కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుంది అన్న దుగ్ధతోనే ఏపీని నో డెవలప్ మెంట్ స్టేట్ గా మార్చేశారు. జగన్ నిర్వాకం వలన గత 5 ఏళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలోనూ చివరి నుంచి మొదటి స్థానంలోనిలిచింది. రాజధాని అమరావతిని పూర్తి చేస్తే చంద్రబాబుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుర్తింపు మరింత పెరుగుతుందని మూడు రాజధానుల నాటకానికి తెరలేపి దానిని నిర్వీర్యం చేసింది జగన్ సర్కార్. అలాగే పోలవరం ప్రాజెక్టు పురోగతిని కూడా నిలిపివేసింది. అదే విధంగా యువతకు అపార ఉపాధి అవకాశాలను కల్పించే ఐటీ రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేసింది జగన్ సర్కార్. చంద్రబాబు 2014 నుంచి 2019 వరకూ ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అనేక కంపెనీలు రాష్ట్రానికి తరలి వచ్చాయి. అయితే జగన్ నిర్వాకంతో గత ఐదేళ్లలో ఏపీ ఐటీ రంగంలో అధమ స్థానానికి పడిపోయింది. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి బాటలు పరిచారు. విశాఖపట్నం, మంగళగిరిలు ఐటీ హబ్ లుగా అవతరించాయి. రాష్ట్రంలో స్టార్టప్ లు వెల్లువెత్తాయి. అయితే ఇదంతా మూడున్నరేళ్ల కిందటి మాట. రాష్ట్రంలో జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కటొక్కటిగా రాష్ట్రం నుంచి తరలిపోయాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ కుదేలైంది. ఔను నిజమే జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ ఎగుమతులలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 2021-2022 ఆర్ధిక సంవత్సరంలో భారత్ నుంచి రూ.11.59 లక్షల కోట్ల విలువల ఐటి ఎగుమతులు జరిగితే వాటిలో ఆంధ్రప్రదేశ్ భాగం కేవలం రూ.1,000 కోట్లే. దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా చెప్పుకునే బీహార్ కూడా ఏపీ కంటే మిన్నగా రూ.2,000 కోట్లు విలువల ఐటి ఎగుమతులు చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కర్నాటక ఆగ్రస్థానంలోనూ, మహారాష్ట్ర రెండో స్థానంలోనూ నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో సాఫ్ట్ వేర్ ఉత్పత్తులలో కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తొలి ఐదు స్థానాలలో నిలిచాయి. మొత్తం ఉత్పత్తుల్లో ఈ ఐదు రాష్ట్రాల వాటా 88.57శాతం అయితే.. మిగిలిన రాష్ట్రాలన్నిటి వాటా 11.43శాతం. ఇందులో ఏపీ వాటా 0.111 శాతం మాత్రమే. ఇదీ ఐటీ మంత్రిగా గుడివాడ అమర్నాథ్ వెలగబెట్టిన నిర్వాకం. మంత్రిగా తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ ఆయన చెప్పిన గుడ్డు కథ అప్పట్లో పెద్ద ఎత్తున హేళనకు గురైంది. ఇంతకీ అప్పట్లో ఆయనేం చెప్పారంటే.. ‘ కోడి గుడ్డును పెట్టగలదు కానీ కోడిని పెట్టలేదుగా.. ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డును పెట్టిందనీ, దానిని పొదగాలి, అది కోడి కావాలి పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి అని చెప్పుకునేవారు. అందులోని లాజిక్ కనీసం ఆయనకైనా అర్ధమయ్యిందో లేదో కానీ, జగన్ ఐదేళ్ల హయాంలో రాష్ట్రంలో కోడి గుడ్డూ పెట్టలేదు, పొదగా లేదు, పిల్లలూ కాలేదు, అవి పెరిగి పెద్దా కాలేదు. అందుకే అన్ని రంగాలతో పాటు తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా వెలుగొందుతున్న ఐటీ రంగం కూడా రాష్ట్రంలో కుదేలైంది. ఇప్పుడు జగన్ అధికారంలో లేరు. మాజీ ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే గుడివాడ అమర్నాథ్ కూడా మాజీ మంత్రి అయిపోయారు. అయినా ఆయన గుడ్డు కథను మాత్రం వదలడం లేదు. ప్రధాని నరేంద్రమోడీ బుధవారం (జనవరి 8) విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన విశాఖ రైల్వే జోన్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్క్, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ లకు భూమి పూజ చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదం చేయడమే కాకుండా, భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి. మూడు రాజధానులు అంటూ జగన్ విశాఖను ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ చేస్తాను, ఇక్కడ నుంచే పాలన సాగిస్తానంటూ గొప్పలు చెప్పినా.. తన భార్య కోసం రుషికొండకు బోడిగుండు కొట్టించి విలాసవంతమైన భవనం నిర్మించడం తప్ప చేసిందేమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం హయాంలో ఆరు నెలలలోనే విశాఖలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరగడంతో పాటు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కూడా పెరుగుతుండటంతో వైసీపీ అప్రమత్తమైంది. గుడివాడ అమర్నాథ్ తెరమీదకు వచ్చి మరో సారి కోడిగుడ్డు కథ చెప్పేశారు. ఇప్పుడు అంటే మంగళవారం (జనవరి 8) మోడీ భూమి పూజ చేయనున్న ప్రాజెక్టులన్నిటికీ జగన్ హయాంలోనే అంకురార్పణ జరిగిందనీ, ఇప్పడు చంద్రబాబు ఆ క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారంటూ విమర్శలకు దిగారు. అయితే ఆయన మాటలను నెటిజనులు ఎగతాళి చేస్తున్నారు. గుడ్డు కథలు ఆపు అమర్నాథూ అంటూ చురకలం టిస్తున్నారు. మాజీవి అయినా గుడ్డు కథ మారలేదేంటి? అని సెటైర్లు వేస్తున్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఐటీ పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి. జగన్ హయాంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయని విశాఖ రైల్వే జోన్ ఇప్పుడు సాకారం అవుతోంది.
http://www.teluguone.com/news/content/no-change-in-gidiwada-amarnath-guddukatha-25-190957.html