అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య..!
Publish Date:Aug 12, 2026
Advertisement
ఇంటి కోసం రూ.90 లక్షల అప్పు చేసిన విద్యుత్ ఉద్యోగి..! బ్యాంక్ లోన్ రాక బలవన్మరణం..! నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదకర సంఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సొంతింటి కల నెరవేర్చుకోవాలనే ఆశతో చేసిన అప్పులు, తీర్చే మార్గం లేక పెరిగిన మానసిక ఒత్తిడి ఆ ఇంట కోలుకోలేని విషాదాన్ని నింపాయి. కట్టుకున్న భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు లోకాన్ని విడిచి వెళ్లడంతో ఇద్దరు చిన్నారి పిల్లలు అనాథలయ్యారు. ఈ దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్‌నగర్‌లో చోటుచేసుకుంది. జిల్లాలోని మోండోరా మండలం నాగంపేటకు చెందిన శేషాల నరేశ్‌కు (35), కోటగల్లికి చెందిన మేఘనతో (30) 2014లో వివాహమైంది. వీరికి అయాన్ష్ (9), మిథున్ (7) అనే ఇద్దరు కోడుకులు. తండ్రి మరణించడంతో నరేశ్‌కు ఐదేళ్ల కిందట విద్యుత్ శాఖలో అటెండర్‌గా ఉద్యోగం లభించింది. తన పనితీరుతో ఆరు నెలల కిందట జూనియర్ అసిస్టెంట్‌గా పదోన్నతి కూడా పొందాడు. ప్రస్తుతం నిజామాబాద్ రూరల్ ఈఆర్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న నరేశ్, వినాయక్‌నగర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అయితే, గతేడాది సొంతింటి కల కోసం నరేశ్ సుమారు రూ.90 లక్షల భారీ మొత్తం అప్పు చేసి ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. ఆ ఇంటిపై బ్యాంక్ లోన్ పొంది బయట చేసిన అప్పులు చెల్లించాలని నరేశ్ భావించాడు. కానీ ఊహించని విధంగా బ్యాంకు నుంచి లోన్ మంజూరు కాలేదు. దీనికితోడు బయట ఇచ్చిన వారి నుంచి వడ్డీలు, అసలు చెల్లించాలని ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో పరిస్థితి చేయిదాటక ముందే కొద్దిరోజుల కిందట ఆ ఇంటిని అమ్మేసి, వచ్చిన డబ్బులతో కొంతమేర బాకీలు తీర్చాడు. అయినప్పటికీ ఇంకా భారీ మొత్తంలో అప్పులు మిగిలిపోవడంతో నరేశ్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. పరిస్థితి గమనించిన కుటుంబసభ్యులు అతనికి మానసిక వైద్య నిపుణులతో చికిత్స కూడా అందిస్తున్నారు. మంగళవారం ఉదయం ఇద్దరు పిల్లలు బడికి వెళ్లిన తర్వాత ఇంట్లో దంపతుల మధ్య తీవ్రమైన మానసిక మథనం జరిగింది. ఉదయం 10:30 గంటల సమయంలో మేఘన తల్లి లావణ్య ఫోన్ చేయగా, కుమార్తె మాట్లాడిన తీరు అనుమానాస్పదంగా అనిపించింది. పిల్లల గురించి అడిగితే వేరే ఇంటికి పంపానని చెప్పి సంభాషణ ముగించింది. కలవరపడిన తల్లి గంటన్నర తర్వాత బంధువులతో కలిసి ఇంటికి చేరుకోగా, లోపలి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. కిటికీ గుండా పరిశీలించగా ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. తలుపులు బద్దలుగొట్టి ఆసుపత్రికి తరలించగా, వారు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భర్త నరేశ్ బెడ్‌రూమ్‌లో ఉరివేసుకోగా, భార్య మేఘన మరో గదిలో విషం తాగి ప్రాణాలు విడిచింది. ఘటనా స్థలంలో నరేశ్ రాసిన లేఖ లభ్యమైంది. అప్పులు, అనారోగ్య సమస్యల వల్లే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని, తమపై ఉన్న కోపాన్ని చిన్నారి పిల్లలపై చూప వద్దని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. పిల్లలు బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని కోరాడు. తండ్రి రాసిన ఆఖరి లేఖను చూసి మనస్తాపానికి గురైన మేఘన ముందుగానే విషం తాగి ఉంటుందని, ఆ తర్వాత నరేశ్ ఉరివేసుకుని ఉంటాడని బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Nizamabad couple suicide, Sheshala Naresh, Nizamabad crime news, Vinayaknagar suicide, debt trap suicide Telangana, Electricity department employee suicide
http://www.teluguone.com/news/content/nizamabad-couple-suicide-36-228714.html





