ఓలమ్మో.. దువ్వాడ సీరియల్లో కొత్త ట్విస్టు..!
Publish Date:Sep 14, 2024
Advertisement
ఏంటీ... తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ దువ్వాడ డైలీ సీరియల్ నుంచి విముక్తి లభించదా? అయిపోయినట్టే అయిపోతుంది.. మళ్ళీ స్టార్టవుతుంది. కథ కంచి వెళ్ళినట్టే వుంటుంది.. మళ్ళీ బేతాళ కథాలాగా మొదటికి వస్తుంది. ఇప్పుడు ఈ ఆయనకిద్దరు కథ మరో కొత్త ట్విస్టు తీసుకుంది. మొన్నామధ్య దువ్వాడ శ్రీనివాస్ ఒక తెలివైన పని చేశానని అనుకుంటూ, తాను వుంటున్న ఇంటిని దివ్వెల మాధురికి రిజిస్ట్రేషన్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌కి, ఆయన భార్య దువ్వాడ వాణికి మధ్య ఇష్యూ ఆ ఇంటి వల్లే కాబట్టి, ఇప్పుడు ఆ ఇల్లు మాధురి పేరిట రిజిస్టర్ అయిపోయింది కాబట్టి ఇక దువ్వాడ వాణి చేసేదేమీ లేదని, సదరు ఇంటికి వెళ్ళే అవకాశం లేదని, దాంతో ఈ వివాదం సద్దుమణుగుతుందనే అభిప్రాయాలు వినిపించాయి. హమ్మయ్య.. సుదీర్ఘంగా సా........గుతున్న ఒక డైలీ సీరియల్ ముగిసిందన్న ఆనందం తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తమైంది. రేటింగ్ తగ్గిపోయి అల్లాడుతున్న తెలుగు టీవీ సీరియళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు తమకు మళ్ళీ రేటింగ్ పెరుగుతుందని ఆనందపడ్డారు. అయితే వాళ్ళ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఈ దువ్వాడ సీరియల్ కొత్త ఎపిసోడ్‌తో మళ్ళీ మొదలైంది.
ఊహించని విధంగా దువ్వాడ వాణి తన కుమార్తెతో కలసి మళ్ళీ సదరు ఇంటికి వెళ్ళారు. కోర్టు ఆమెకు ఆ ఇంటిలోకి దువ్వాడ వాణి వెళ్ళొచ్చనే ఆదేశాలు ఇచ్చిందట. దాంతో ఆమె ఆ ఇంటి ఆవరణలోనే సెటిలయ్యారు. తలుపులు ఓపెన్ చేస్తే చాలు.. లోపలకి వెళ్ళి అన్నం కూరలు వండేసుకుని, టీవీ చూస్తూ తినడానికి ప్రిపేర్‌గా వున్నారు. ఇంటి లోపల వున్న దివ్వెల వాణి మాత్రం ఇలాంటి డేంజర్ ఏమీ జరక్కుండా తలుపులు బిగించేశారు. ఇంటి ఆవరణలో కూర్చున్న దువ్వాడ వాణి మీడియాని పిలిపించి రచ్చ చేస్తున్నారు. ఓ యాభై మంది సబ్‌స్క్రైబర్లు వున్న యూట్యూబర్ మైకు పుచ్చుకుని వెళ్ళినా ఆమె తన ఆవేదన వ్యక్తం చేస్తూ స్టోరీ అంతా చెబుతున్నారు. దువ్వాడ వాణి ప్రస్తుతం చెప్పేది ఏమిటంటే, ‘‘ఈ ఇల్లు నేను ఇచ్చిన డబ్బుతో కట్టించినదే. దీన్ని అమ్మడానికి దువ్వాడ శ్రీనివాస్‌కి హక్కు లేదు. దువ్వాడ శ్రీనివాస్ చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. ఈ ఇల్లు నాది. ఈ ఇంటిని నేను స్వాధీనం చేసుకుంటాను. అప్పటి వరకు ఈ ఇల్లు వదిలిపెట్టను. కోర్టు కూడా నేను ఈ ఇంట్లో వుండొచ్చని ఆర్డర్ ఇచ్చింది’’ అంటూ స్పష్టంగా చెబుతున్నారు. అందువల్ల తెలుగు టీవీ డైలీ సీరియళ్ళకు మరికొంతకాలం రేటింగ్‌లు వుండవని అర్థం చేసుకోవాలి మరి!
http://www.teluguone.com/news/content/new-twist-in-duvvada-case-25-184799.html