బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఎవరికి? కిషన్ రెడ్డికి ఉద్వాసన ఎప్పుడు?
Publish Date:Aug 10, 2024
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారా? కిషన్ రెడ్డి స్థానంలో మరో వ్యక్తి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రానున్నారని గత కొంత కాలంగా ఆ పార్టీలోనే విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పార్టీ అధిష్ఠానం రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించే ఉద్దేశంలో ఉందని చెప్పకనే చెప్పారు. కిషన్ రెడ్డికి బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించడానికి ముందు వరకూ ఆ పదవిలో బండి సంజయ్ ఉన్నారు. గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ హైకమాండ్ బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది. కిషన్ రెడ్డికి బీజేపీ రాష్ట్రపగ్గాలు అప్పగించడంపై అప్పట్లోనే పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన క్షణం నుంచే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు కిషన్ రెడ్డి చేజారడం ఖయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. సాధారణంగా బీజేపీలో గ్రూపు తగాదాలు ఉండవు అని అంటుంటారు. అయితే తెలంగాణ బీజేపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవలన్న లక్ష్యంతో బీజేపీ గత నాలుగైదేళ్లుగా పార్టీ గేట్లు బార్లా తెరిచేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో కేసీఆర్ రెండో సారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత బీజేపీ తీరులో గణనీయమైన మార్పు వచ్చింది. గతంలోలా పార్టీ సిద్ధాంతాలు, నిబద్ధత, విలువలు వంటి అంశాల కంటే నాలుగు ఓట్లు, రెండు సీట్లు గెలిచే అవకాశాలున్నాయని భావిస్తే చాలు ఎవరికైనా బీజీపీ తీర్థం ఇచ్చేసి పార్టీ కండువా కప్సేయడానికి బీజేపీ హైకమాండ్ వెనుకాడలేదు. అందుకే వామపక్ష భావజాలం ఉన్న ఈటల రాజేందర్ వంటి వారిని పార్టీలో చేర్చుకుని కీలక పదవులు ఇచ్చింది. ఈటలకు చేరికల కమిటీ చైర్మన్ పదవి కట్టబెట్టి పార్టీలోకి చేరికలను ప్రోత్సహించేందుకు కూడా వెనుకాడ లేదు. అయితే కమలనాథుల పాచికలు, వ్యూహాలు ఈ విషయంలో పెద్దగా ఫలించలేదు. రాష్ట్ర బీజేపీలో కొత్తగా వచ్చిన వారి పట్ల తొలి నుంచీ పార్టీలో ఉన్న వారిలో తీవ్ర అంసతృప్తి మొదలైంది. ముందొచ్చిన చెవుల కంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా పార్టీ హైకమాండ్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఈసారైనా అందరినీ కలుపుకుని పోయి, పార్టీలో గ్రూపు తగాదాలను రూపుమాపి పార్టీని ఏకతాటిపైనడిపించే వ్యక్తి కోసం బీజేపీ హైకమాండ్ గాలిస్తోంది. ఎందుకంటే.. బండి సంజయ్ నుంచి కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర పగ్టాలు చేపట్టిన సందర్భంగా అప్పట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నేతలు బాహాటంగా కిషన్ రెడ్డికి పార్టీ బాధ్యతలు అప్పగించడాన్ని నిరసించారు. దాంతో అప్పట్లో కిషన్ రెడ్డికి పార్టీ అధ్యక్షుడిగా స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన సభ బండి సంజయ్ సన్మాన సభగా మారిపోయింది. ఆ సభలో మాట్లాడిన పలువురు బీజేపీ నేతలు బండి సంజయ్ ను పొగడ్తలలో ముంచేశారు. ప్రశసంల వర్షం కురిపించి ఉక్కిరిబిక్కిరి చేశారు. బండి సంజయ్ స్థానంలో పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన క్షణం నుంచే కిషన్ రెడ్డికి పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. ఆ సెగ కారణంగానే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ డబుల్ డిజిట్ కు చేరుకోవడంలో విఫలమైందని పార్టీ వర్గాల్లో అప్పట్లోనే గట్టిగా వినిపించింది. ఆ తరువాత లోక్ సభ ఎన్నికలలో బీజేపీ మెరుగ్గానే పెర్ఫార్మ్ చేసినా ఆ క్రెడిట్ కిషన్ రెడ్డి ఖాతాలో పడలేదు. లోక్ సభ ఎన్నికలలో ఈటల రాజేందర్ మల్లాజ్ గిరి స్ధానం నుంచి భారీ మెజారిటీతో గెలవడంతో ఒక దశలో ఆయనకే పార్టీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తుందన్నభావన బీజేపీ శ్రేణులలోనే వ్యక్తమైంది. రాష్ట్ర పార్టీలో విభేదాలను రూపు మాపి.. పాత, కొత్త నేతలందరినీ ఏకతాటిపై నడిపించగలిగిన నాయకుడి కోసం బీజేపీ అధిష్ఠానం గాలిస్తోంది. అయితే ఆ ఎంపిక కసరత్తు మాత్రం దీర్ఘ కాలంగా సాగుతోంది. తాజాగా బండి సంజయ్, కిషన్ రెడ్డిల మాటలతో త్వరలోనే కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం ఖాయమని తేలిపోయింది. దీంతో బీజేపీ అధిష్ఠానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించేదెవరిన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈటల రజేందర్, డీకే అరుణ రేసులో ముందున్నారని అంటున్నారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతంపై సీరియస్ గా దృష్టి సారించిన బీజేపీ అధిష్ఠానం రాష్ట్రంలో పార్టీలో అందరినీ కలుపుకుని పోయే వ్యక్తికే పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగించాలన్న భావనతో ఉంది.
http://www.teluguone.com/news/content/new-presifent-for-telangana-bjp-25-182690.html





