మాజీ మావోల కొత్త పొలిటికల్ పార్టీ?
Publish Date:Dec 24, 2025
Advertisement
ఆయుధాలను విసర్జించి లొంగిపోయిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. నక్సల్ రహిత భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ ఆయుధాలు విడిచి లొంగిపోయిన మావోయిస్టుల సంఖ్య ఆరు వేలకు పైగానా ఉంటుంది. ఇలా లొంగిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలు కూడా ఉన్నారు. వారు ఆయుధాలు విడిచి లొంగిపోవడమే కాకుండా, ఇంకా ఉద్యమంలో కొనసాగుతున్న మావోయిస్టులు కూడా లొంగిపోవాలంటూ పిలుపు కూడా ఇచ్చారు. సాయుధ పోరాటానికి కాలం చెల్లిందని ప్రకటించడమే కాకుండా జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి శాంతియుత మార్గాన్ని అనుసరించాలని చెప్పారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇంత కాలం వ్యతిరేకిస్తూ వచ్చిన లొంగిపోయిన మావోయిస్టు నేతలు ఇప్పుడు అదే వ్యవస్థ ద్వారా సమాజంలో మార్పు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇందుకు తాజాగా మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల ఇక ఆయుధాలు చేపట్టబోమంటూ చేసిన ప్రకటనే సాక్ష్యంగా నిలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయంగా ముందుకు వెడతామని ఆయన అన్న మాటలు మాజీ మావోయిస్టులు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న చర్చకు దారి తీసింది. లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్, తక్కెళ్ల పల్లి వాసుదేవరావు తదితరుల నేతృత్వంలో ఒక కొత్త రాజకీయపార్టీ ఆవిర్భవించే అవకాశం ఉందని పరిశీలకులు సైతం వారి ప్రకటనలు ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు. భారత రాజ్యాంగానికి లోబడే వీరు ఏర్పాటు చేసే కొత్త రాజకీయ పార్టీ పని చేసే అవకాశాలున్నాయంటున్నారు. ఇటీవల మల్లోజుల వేణుగోపాల్ ఒక జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాజీ మావోల కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. మరో సారి ఆయుధాలు చేపట్టే ప్రశ్నే లేదన్న ఆయన ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయ మార్గాన్ని ఎంచుకుంటామని విస్పష్టంగా చెప్పారు. ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక అగ్రనేతలు సహా దాదాపు ఆరువేల మంది లొంగిపోయిన సంగతి తెలిసిందే. లొంగుబాటు తరువాత కూడా వీరంతా ఒకరితో ఒకరు టచ్ లోనే ఉణ్నారంటున్నారు. పైగా లొంగిపోయిన వారంతా ప్రస్తుతం వేర్వేరు రాష్ట్రాలలో పోలీసు కేంద్రాలలోనే ఉన్నారు. కేంద్ర హోంశాఖ నిర్దేశించిన గడువు ముగిసిన తరువాత వీరంతా జనజీనవ స్రవంతిలోకి వస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల మాటలు మాజీ నక్సల్స్ కోత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తారన్న అభిప్రాయం కలిగేలా చేశారు. మావోయిస్టులు కొత్త రాజకీయ పార్టీ అంటూ ప్రారంభిస్తే.. వారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది? గతంలో తిరస్కరించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానానికి అనుగుణంగా వీరు తమ సిద్ధాంతాలకు ప్రజలలో ఎలా ప్రాచుర్యం కల్పిస్తారు అన్నది వేచి చూడాల్సిందే.
http://www.teluguone.com/news/content/new-political-party-from-dormer-maoists-25-211503.html





