ఇంకా అంధకారంలోనే ఏపీ అధికారులు!
Publish Date:Jul 24, 2024
Advertisement
జగన్ చీకటి పాలన తొలగిపోయి దగ్గర దగ్గర రెండు నెలలు కావొస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులలో చాలామంది ఇంకా అంధకారంలోనే వున్నారు. ఇంతకాలంలో చేయడానికి పనేమీ లేక టైమ్‌పాస్ చేసిన అధికారగణం, ఇప్పుడు ఒళ్ళు వంచి పనిచేయాల్సి రావడంతో ఇబ్బంది పడిపోతున్నారు. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్టుగా పని నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయాల్లో వున్న కొందరు అధికారులైతే, తాము సక్రమంగా పని చేయకపోగా, కొత్త మంత్రులను బోల్తా కొట్టించేలా వ్యవహరిస్తున్నారు. గత ప్రభుత్వ ఘనకార్యాలకు సంబంధించిన వివరాలు అడిగితే పూర్తి వివరాలు ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయం మీద అసెంబ్లీ లాబీల్లో మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వ అక్రమాలను వెలికి తీస్తోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో జరిగిన పనులు, దోపిడీపై అనేక మంది సభ్యులు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీటిపై సరైన సమాచారం ఇవ్వాలని మంత్రులు అధికారులకు సూచిస్తున్నారు. అయితే అధికారులు ఇచ్చే అరకొర వివరాలు చూసి కొత్త మంత్రులు అసంతృప్తికి గురవుతున్నారు. తమనే బోల్తా కొట్టించేలా అధికారులు వ్యవహరిస్తున్నాని అంటూ పలువురు మంత్రులు అసెంబ్లీలో చర్చించుకుంటున్నారు. గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అధికారులిచ్చిన సమాచారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు ప్రశ్నకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వకుండా ‘‘అవును, కాదు, ఉత్పన్నం కాదు’’ అంటూ అధికారులు సమాధానమివ్వడం ఏంటని పవన్ కళ్యాణ్ అభ్యంతరం తెలిపారు. పొడి పొడిగానే సమాధానాలు చెప్పాలనే నిబంధన ఏమైనా ఉందా అని ఆయన అధికారులను ప్రశ్నించారు. అనుబంధ పత్రాల్లో కాకుండా సభ్యులకిచ్చే సమాధానంలోనే వివరాలు ఉంచేలా చూడాలని అధికారులను పవన్ ఆదేశించారు. అదేవిధంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపుపైనా అధికారుల సమాచారంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. జగన్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఎంత మాత్రం మళ్లించలేదని అధికారులు సమాచారమిచ్చారు. దీనిపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు విషయంలో పూర్తిస్థాయి సమాచారం తనకు అందలేదని మంత్రి తెలిపారు. వెంటనే పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/negligence-of-andhra-pradesh-officials-25-181412.html





