ఇదీ డబుల్ ఇంజిన్ పవర్.!
Publish Date:Jul 18, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సరికొత్త పుంతలు తొక్కుతోందని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన లోకేష్.. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లనే రాష్ట్రానికి మెగా పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన వేగంగా సాధ్యమవుతున్నాయన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించిన ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అమరావతి పనులను శరవేగంగా పరిగెత్తిస్తున్నదన్నారు. అమరావతిని కేవలం భవనాల నగరంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయి ఎయిర్, రోడ్, రైల్ కనెక్టివిటీ కలిగిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమనిఉద్ఘాటించారు. గతంలో భారత రైల్వే రంగంలో భద్రత, పరిశుభ్రత లోపించేవని, కానీ ప్రధాని మోడీ ముందుచూపు వల్ల దేశంలో వందే భారత్, బుల్లెట్ రైళ్లు, 'కవచ్' ఆటోమేటిక్ ప్రొటెక్షన్ టెక్నాలజీతో కూడిన సరికొత్త రైల్వే విప్లవం నడుస్తోందని లోకేష్ కొనియాడారు. దశాబ్దాల నాటి ఆంధ్రుల కల అయిన విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ప్రధాని మోడీ వెంటనే మంజూరు చేసి కార్యరూపంలోకి తెచ్చారని, ఇందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేకంగా మాట్లాడిన లోకేష్.. మంగళగిరిలో వంద పడకల ఆసుపత్రి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వంటి ఎన్నో పనులను కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో పూర్తి చేస్తున్నట్లు వివరించారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి కోసం కేంద్ర పర్యాటక శాఖ ద్వారా ' ప్రసాద్' పథకం కింద నిధులు రాబట్టేందుకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ చూపారని, ఎంపీ, ఎమ్మెల్యే కలిసి కట్టుగా పని చేస్తే నియోజకవర్గం ఎలా మారుతుందో చెప్పడానికి మంగళగిరి ఒక ఉదాహరణగా నిలిచిందని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ, సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు. ఒక రూపాయి ఆదాయానికి ఒక రూపాయి నలభై పైసల ఖర్చు ఉన్నప్పటికీ.. సూపర్ సిక్స్ హామీలైన తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, డీఎస్సీ, మెగా జాబ్ క్యాలెండర్ వంటి ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. గతంలో పెట్టుబడులు లేక ఏపీ తీవ్రంగా నష్టపోయిందనీ.. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయల్ ఎన్‌ఫీల్డ్, గూగుల్ వంటి గ్లోబల్ సంస్థలతో పాటు ఫైటర్ జెట్ తయారు చేసే అమ్కా వంటి భారీ ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్‌కు క్యూ కడుతున్నాయన్నారు. రాబోయే మూడేళ్లలో రాష్ట్ర నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూడాల్సిన అవసరం ఉండదని, పొరుగు రాష్ట్రాల యువతే ఏపీ వైపు చూసేలా పారిశ్రామిక విప్లవాన్ని తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు తాను చంద్రబాబు నాయుడు గారి కుప్పం నియోజకవర్గ అభివృద్ధిని చూసి నేర్చుకునేవాడినని, కానీ ఇప్పుడు కుప్పం నేతలు కూడా మంగళగిరిని చూసి నేర్చుకునే స్థాయికి ఇక్కడి అభివృద్ధిని తీసుకెళ్లామని సగర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో మంగళగిరిని ఐటీ, పారిశ్రామిక హబ్‌గా మారుస్తామని లోకేష్ స్పష్టం చేశారు. Nara Lokesh Mangalagiri, Amaravati Capital Development, AP Double Engine Government, Andhra Pradesh Mega Investments South Coast Railway Zone Vizag
http://www.teluguone.com/news/content/nara-lokesh-mangalagiri-25-226410.html




