చంద్రబాబు కాదు.. చిన్నబాబే!
Publish Date:Dec 1, 2025
Advertisement
ఇంతై.. ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లుగా రాజకీయంగా, వ్యక్తిగా నారా లోకేష్ రోజు రోజుకూ ఎదుగుతున్నారు. తండ్రి చాటు బిడ్డగా, ఆయన చిటికిన వేలు పట్టుకుని రాజకీయాలలో బుడిబుడి అడుగులు ఆరంభించిన లోకేష్ ఇప్పుడు తండ్రితో సమానంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రాధాన్యత, అధికార పరిధి విస్తరణ వేగంగా పెరుగుతోంది. పార్టీలో నవతరం నాయకుడిగా నారా లోకేష్ తనను తాను నిరూపించుకోవడమే కాకుండా పార్టీ నేతలు, శ్రేణుల నుంచి మద్దతు కూడా పొందుతున్నారు. పార్టీ వ్యవహారాలలో ఆయన పోషిస్తున్న కీలక పాత్ర పరిధి విస్తృతి చంద్రబాబుతో సమానంగా మారుతోందనడానికి ఇటీవలి కాలంలో పలు తార్కానాలు కనిపించాయి. గతంలో విదేశాలలో చిక్కుకున్న తెలుగువారిని వెనక్కు తీసుకురావడంలో కానీ.. ప్రకృతి విపత్తులు సంభవించిన సమయంలో సహాయ పునరావాస కార్యక్రమాల పర్యవేక్షణలో కానీ గతంలో చంద్రబాబు ఏ విధంగా క్రియాశీలంగా వ్యవహరించారో తెలిసిందే. ఇప్పుడు ఆ పనిని అంతే సమర్థతతో.. ఇంకా చెప్పాలంటే అంతకు మించి అన్నట్లుగా లోకేష్ నిర్వహిస్తున్నారు. అంతే కాదు జాతీయ స్థాయిలో కూడా లోకేష్ కు మంచి గుర్తింపు లభిస్తోంది. కేంద్రంతో సంబంధాల విషయంలో కానీ, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే అంశంలో కానీ లోకేష్ ను తండ్రిని మించిన తనయుడిగా పార్టీ నేతలూ, శ్రేణులే కాదు, పరిశీలకులు సైతం అభివర్ణిస్తున్నారు. ఇహ ఇప్పుడు తాజాగా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్ లతో భేటీ అవుతారు. ఈ భేటీలలో ఆయన ఇటీవలి మొంథా తుపాను కారణంగా రాష్ట్రానికి జరిగిన ఆస్తినష్టాన్ని, రాష్ట్రంపై పడిన ఆర్థిక భారాన్నీ వారికి వివరిస్తారు. అందుకు సంబంధించిన నివేదికలు సమర్పిస్తారు. కేంద్రం నుంచి సహాయాన్ని కోరతారు. సాధారణంగా ఇలా కేంద్రానికి విజ్ణప్తులు చేయడం, ప్రకృతివిపత్తుల కారణంగా సంభవించిన ఆర్థిక నష్టాన్ని వివరించి సహాయం కోరడం అన్నది ముఖ్యమంత్రి చేస్తారు. అయితే ఇప్పుడు ఆ బాధ్యత లోకేష్ తీసుకున్నారు. అంతే కాదు.. పార్లమెంటులో తెలుగుదేశం సభ్యులు అనుసరించాల్సిన వ్యూహం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను లేవనెత్తే విషయంలో లోకేష్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీలోనూ, కూటమి ప్రభుత్వంలోనూ లోకేష్ కు పెరుగుతున్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతను కూటమి భాగస్వామ్య పార్టీలు కూడా స్వాగతిస్తున్నాయి. అంతగా ఆయన తన సమర్ధతతో అందరినీ ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.
http://www.teluguone.com/news/content/nara-lokesh-importance-and-priority-increasing-39-210306.html





