విశాఖ ఉక్కు పోతుంటే మౌనమేంటీ జగన్ రెడ్డి!
Publish Date:Feb 5, 2021
Advertisement
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటుకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ను కాపాడాలంటూ కార్మికులు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై ఘాటుగా స్పందించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రుల హక్కైన విశాఖ ఉక్కుని తన స్వార్ధ ప్రయోజనాల కోసం సీఎం జగన్ తాకట్టు పెడుతున్నారంటూ ఆయన ట్విటర్ వేదికగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 28 మంది వైసీపీ ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం లాభమని ప్రశ్నించారు. 32 మంది ప్రాణాలు త్యాగంచేసి సాధించుకున్న స్టీల్‌ప్లాంట్.. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు నారా లోకేష్. విశాఖ స్టీల్ ప్లాంట్ ద్వారా వేలాది మంది ప్రత్యక్షంగా, లక్షలాదిమంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారని చెప్పారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే మణిహారంగా వెలుగొందుతోన్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మేస్తుంటే ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి మౌనం దాల్చడం దేనికి సంకేతమన్నారు. ఇలా ఒక్కో పరిశ్రమా అమ్మేయడం, అడవులు-కొండల్ని కబ్జా చేయడమేనా పరిపాలనా రాజధాని అంటే జగన్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు లోకేష్. కాకినాడ పోర్టు విజయసాయి రెడ్డి అల్లుడికి వరకట్నంగా రాసిచ్చేశారని విమర్శించారు. విశాఖ ఏజెన్సీలో లేటరైట్ గనులు బాబాయ్ సుబ్బారెడ్డికి బహూకరించారని, తన దోపిడీ మత్తుకి మంచింగ్‌గా మచిలీపట్నం పోర్టుని నంజుకు తింటున్నారన్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్‌ని తన సూట్ కేసు కంపెనీలతో తుక్కు రేటుకి కొని దోపిడీ వికేంద్రీకరణ పరిపూర్ణం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ఆంధ్రుల హక్కు.. విశాఖ ఉక్కుని కాపాడుకుంటామని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
http://www.teluguone.com/news/content/nara-lokesh-fire-on-jagan-over-vizag-speel-plant-issue-39-109652.html





