వైసీపీ ర్యాలీలకు లేని రచ్చ అమరావతి రైతులకెందుకు!
Publish Date:Nov 7, 2021
Advertisement
అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోలీసులు అడ్డంకులు స్పష్టించడం దుమారం రేపుతోంది. కొవిడ్ పేరుతో ఆంక్షలు విధించడంపై రైతులు, విపక్షాలు మండిపడుతున్నాయి. రాష్ట్రంలో వైసీపీ నేతలు జోరుగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. సభలు నిర్వహిస్తున్నారు. వైసీపీ నేతలకు అడ్డురాని కొవిడ్ రూల్స్.. అమరావతి రైతులకే వర్తిస్తాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మహా పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు నోటీసులు ఇచ్చిన ప్రకాశం జిల్లా పోలీసులపై తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , ఎమ్మెల్సీ నారా లోకేశ్ మండిపడ్డారు. రాజధాని కోసం మహిళలు, రైతులు చేస్తున్న పాదయాత్రకు పోలీసులు అడ్డు చెప్పడాన్ని ఆయన విమర్శించారు. వైసీపీ నేతలు రచ్చ చేసేందుకు అడ్డురాని నిబంధనలు కేవలం అమరావతి రైతుల పాదయాత్రకే అడ్డొచ్చాయా? అని ఆయన ప్రశ్నించారు. కరోనా నిబంధనలు, స్పీకర్లు పాదయాత్రకే అడ్డంకిగా మారాయా? అని లోకేష్ ట్వీట్ చేశారు. నడిరోడ్డుపై అధికార పార్టీ నేతలు రచ్చ చేస్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదని నారా లోకేష్ నిలదీశారు. వైసీపీ కార్యకర్తలకు పోలీసులు రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రకు నోటీసులివ్వడమే పోలీసుల దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. అమరావతిని చంపేసి ఉద్యమాన్ని అణచేసేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఉద్యమం ఆగదన్నారు. యాత్రను అడ్డుకోవాలని చూస్తే.. మరింత ఉద్ధృతం అవుతుందని లోకేశ్ హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/nara-lokesh-fire-on-jagan-govt-over-amaravathi-farmers-padayatra-police-restrictions-39-125951.html





