బీసీఐపై నిప్పులు చెరిగిన సీజేఐ.. నల్సార్ విద్యార్థులపై చర్య తీసుకోవద్దని ఆదేశం.!
Publish Date:Aug 14, 2026
Advertisement
నల్సార్ లా యూనివర్సిటీకి చెందిన 2026 బ్యాచ్ విద్యార్థుల న్యాయవాద ఎన్‌రోల్‌మెంట్‌పై విధించిన నిషేధాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) వెనక్కి తీసుకుంది. నల్సార్ లా వర్సిటీ స్నాతకోత్సవానికి భారత్ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్‌ను ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే. వర్సిటీ కాన్వొకేషన్ కు సీజేఐని ఆహ్వానించవద్దంటూ దాదాపు 450 మంది సంతకాలు చేసిన లేఖను వర్సిటీ వీసీకి అందజేయడం సంచలనం సృష్టించింది. గతంలో ఒక కేసు విచారణ సందర్భంగా సీజేఐ చేసిన వ్యాఖ్యలకు నిరసినగా లా విద్యార్థులు వీసీకి ఈ లేఖ రాశారు. దీనిపై తీవ్రంగా మడిపడిన బీసీఐ.. నాల్సార్ విద్యార్థులను అడ్వకేట్లుగా నమోదు చేయవద్దంటూ రాష్ట్ర బార్ కౌన్సిల్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందనీ ఆ హక్కు రాజ్యాంగమే కల్పించిందనీ పేర్కొంటూ.. , ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం బీసీఐకి లేదని కుండబద్దలు కొట్టారు. విద్యార్థిగా ఉండగా తాను కూడా శాంతియుత నిరసనల్లో పాల్గొన్నానన్న సీజేఐ, అయినా విద్యార్థులకు తనకూ మధ్య జరుగుతున్న వ్యవహారమనీ, ఇందులో బీసీఐ జోక్యం అనవసరమని పేర్కొంటూ.. విద్యార్థులపై ఎలాంటి క్రమశిక్షణ లేదా శిక్షాత్మక చర్యలు తీసుకోకూడదని విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు బీసీఐ ఈ నిర్ణయంపై న్యాయవర్గాలతో పాటు సామాజిక మాధ్యమంలోనూ విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తం బ్యాచ్‌పై ఈ విధమైన సామూహిక శిక్ష విధించడం దారుణమని సీనియర్ అడ్వకేట్లు, న్యాయ నిపుణులు విమర్శించారు. దీంతో పరిస్థితి తీవ్రతను గమనించిన బీసీఐ గురువారం (ఆగస్టు 13) సాయంత్రం అత్యవసరంగా సమావేశమై తన ఆదేశాలను వెనక్కు తీసుకుంది. దీంతో నాల్సార్ నుంచి 2026లో పట్టా పొందే విద్యార్థులు తమకు నచ్చిన ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనైనా న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారంలో న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడుతూనే, విద్యార్థుల స్వేచ్ఛను కాపాడటంలో సుప్రీంకోర్టు చూపిన చొరవ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. NALSARLawUniversity, BarCouncilof India, CJISuryaKant, BCIEnrollmentBan, HyderabadLawGraduates
http://www.teluguone.com/news/content/nalsarlawuniversity-36-228942.html





