నాగపూర్ వాలానే నూతన అధ్యక్షుడు?!
Publish Date:Apr 3, 2025

Advertisement
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా పదవీ కాలం ఎప్పుడో ముగిసి పోయింది. లోక్ సభ ఎన్నికలకు ముందే ఆయన సెకండ్ టర్మ్ కూడా పూర్తయింది. అయితే లోక్ సభ ఎన్నికలతో పాటుగా అనేక ఇతర కారణాల వలన, దేశ వ్యాప్తంగా బీజేపీ సంస్థాగత ఎన్నికలు వాయిదా పడడంతో నూతన జాతీయ అధ్యక్షుని ఎన్నిక కూడా లేటవుతూ వస్తోంది. అయితే ఇక వాయిదా ఉండదని ఈ నెలాఖరుకు నూతన అధ్యక్షుని ఎన్నిక క్రతువు పూర్తవుతుందని పార్టీ వర్గాలు విశ్వాసంతో ఉన్నాయి. ఏప్రిల్ 18,19, 20 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలలో, లేదా సమావేశాలు ముగిసిన వెంటనే బీజేపీ జాతీయ అధక్షుని ప్రకటన ఉంటుందని అంటున్నారు.
అయితే నడ్డా స్థానంలో వచ్చే కొత్త అధ్యక్షుడు ఎవరన్న విషయంలో మాత్రం ఈ రోజు వరకు ఎవరికీ స్పష్టత లేదు. నిజానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు సైతం కొత్త అధ్యక్షుడు ఎవరనేది తెలియదని పార్టీ కీలక నేతలే అంటున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అయితే కొత్త అధ్యక్షుడు ఎవరో దేవుడికి కూడా తెలియదని మీడియా ముఖంగానే చెప్పారు. అది కొంచెం అతిశయోక్తి అయినా నూతన అధ్యక్షుడి ఎన్నిక లేదా ఎంపిక విషయంలో ఏర్పడిన చిక్కుముళ్ళు ఇంకా పూర్తిగా విడి పోలేదనేది మాత్రం నిజం. సో.. కౌన్ బనేగా బీజేపీ అధ్యక్ష్ ? అనేది ప్రస్తుతానికి సమాధానం లేని, సమాధానం తెలియని ప్రశ్నగానే ఉందని అంటున్నారు. అయితే అధ్యక్ష ఎన్నిక జాప్యానికి కారణాలుగా చెపుతూ వచ్చిన పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు,పార్లమెంట్ సమావేశాలు, ఇతరత్రా బిజీ ..బిజీ వ్యవహారాలు ముగిసి పోవడంతో ఇక అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఉపందుకుంటుంది అంటున్నారు.
అవును ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ ఆసెంబ్లీ ఎన్నికలతో ప్రస్తుతానికిఎలక్షన్ సీజన్ ముగిసింది. ఈ సంవత్సరం చివర్లో (అక్టోబర్, నవంబర్) జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల వరకూ దేశం మొత్తంలో ఎక్కడా ప్రధాన ఎన్నికలు లేవు. అలాగే ప్రస్తుతం జరుగతున్నపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కూడా ముగింపు దశకు చేరుకున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి4న పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడతాయి. సో పార్టీ అధిష్టానం సంస్థాగత వ్యహరాలపై, ముఖ్యంగా, జాతీయ అధ్యక్షుని ఎన్నికతో పాటుగా తెలంగాణ సహా మరి కొన్నిరాష్ట్రాల రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికల పై దృష్టిని కేద్రీకరిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే మరోవంక బీజేపీ జాతీయ అధ్యక్షుని ఎన్నికలో ఇంతగా జాప్యం జరగడానికి వరస ఎన్నికలు, ఆ వెంటనే వచ్చిన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రమే కారణమా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అంటే, ఉన్నాయనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు, బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరగడం కూడా అద్యక్ష ఎన్నికల జాప్యానికి ఒక ప్రధాన కారణంగా పార్టీలో చర్చ జరుగుతోంది. అంతే కాదు బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య దూరం పెరగడానికి, ఎన్నికలకు ముందు పార్టీ అద్యక్షు జేపీ నడ్డా, చేసిన వ్యాఖ్యలు పైకి కనిపించే కారణం అయినా, బీజేపీలో పెరుగుతున్న వ్యక్తి ఆరాధనకు చెక్ పెట్టే ఉద్దేశంతోనే, ఆర్ఎస్ఎస్ పెద్దలు పార్టీ సంస్థాగత ఎన్నికల పగ్గాలను తమ చేతుల్లోకి తీసుకున్నట్లు నాగపూర్ వర్గాల సమాచారం.
అయితే, ప్రధాని మోదీ నాగపూర్ పర్యటన సందర్భంగా జరిగిన చర్చల నేపధ్యంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తిరిగి వేగం పుంజుకుంటుందని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.అందులో భాగంగానే,రానున్నవారం పది రోజుల్లో ఉత్తర్‌ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమబెంగాల్ సహా మిగిలిన రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంటున్నారు.ఆ వెంటనే పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను ప్రారంభమవుతుంది. అయితే పార్టీ అధ్యక్షుని ఎన్నికతో పాటుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ ప్రత్యక్ష ప్రమేయం ఉంటుందని అంటున్నారు. ఈ మేరకు, ఇటీవల బెంగుళూరులో జరిగిన,ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిథి సభలో నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. ఒక విధంగా వందేళ్ళ పండగ చేసుకుంటున్న సమయంలో, ఆర్టికల్ 370 రద్దు , రామ జన్మభూమి మొదలు ప్రస్తుత వక్ఫ్ సవరణ చట్టం వరకు ఆరఎస్ఎస్’ అజెండా’ లోని ఒక్కొక అంశం నెరవేరుతున్న నేపద్యంలో, ఆర్ఎస్ఎస్ – బీజేపీల మధ్య సైధాంతిక బంధం మరింత బలపడేందుకు దోహదం చేసే ... నాగపూర్ వాలనే బీజీపీ నూతన అధ్యక్షుడు అవుతారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/nagapur-wala-eill-be-bjp-new-chief-39-195502.html












