బీఆర్ఎస్ రాజకీయ క్రీడలో పావు నాగార్జున?
Publish Date:Oct 6, 2024
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో అక్కినేని కుటుంబం గురించి తెలియనివారు ఉండరు. టాలీవుడ్‌లో సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా అక్కినేని నాగేశ్వరరావు గురించి కూడా ప్రస్తావిస్తుంటారు. టాలీవుడ్‌కు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు వీరు ఎన్నో సేవలు అందించారు. అక్కినేని నాగేశ్వరరావు అంటే అన్నివర్గాల ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ అక్కినేని నాగార్జున సైతం అంతే స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. టాలీవుడ్‌లో పలు విధాలుగా ఎంతో మందికి ఉపాధి కల్పించిన.. కల్పిస్తున్న వ్యక్తిగా నాగార్జునకు మంచి పేరుంది. రాజకీయాల జోలికి వెళ్లకుండా అన్ని పార్టీల నేతలతో నాగార్జున సత్సంబంధాలను కలిగి ఉంటారు. రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన్ను నాగార్జున ప్రత్యేకంగా కలిసి అభినందనలు తెలిపారు. అయితే, ఇటీవల కాలంలో రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన హైడ్రాలో భాగంగా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కొంతభాగం చెరువు భూమిని ఆక్రమించి నిర్మించారని గుర్తించి అధికారులు కూల్చివేశారు. ఈ విషయంపై ఆయన కోర్టుకు వెళ్లారు. ఆ సమయంలో బీఆర్ఎస్ నాగార్జునకు మద్దతు పలికేందుకు ముందుకు రాలేదు. కేటీఆర్, నాగార్జునకు మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఒకవేళ నాగ్‌కు మద్దతుగా మాట్లాడితే.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని బీఆర్ఎస్ అధిష్టానం ఎన్ ఎన్వెన్షన్ కూల్చివేత విషయంలో నోరు మెదపలేదు. ఇటీవల మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపిన విషయం తెలిసిందే. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. అయితే, హరీశ్ రావు, కేటీఆర్ డీపీతో ఉన్న బీఆర్ఎస్ మద్దతుదారులు సోషల్ మీడియాలో సురేఖ, రఘునందన్ రావుపై అసభ్యకర పోస్టులు చేశారు. దీనిపై హరీశ్‌రావు స్పందించి తీవ్రంగా ఖండించారు. కేటీఆర్ మాత్రం స్పందించలేదు. కొండా సురేఖ ఈ అంశంపై తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్ ఎందుకు స్పందించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఓ అడుగు ముందుకేసి సమంత, నాగచైతన్య విడిపోవటానికి కారణం కేటీఆర్ అని, కేటీఆర్ కారణంగా చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని కెరీర్ కు అర్ధంతరంగా ఫుల్ స్గాప్ పెట్టేశారనీ అన్నారు. డ్రగ్స్ విషయంలోసైతం కేటీఆర్‌పై కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సమంత, నాగచైతన్య విషయాన్ని ప్రస్తావించడంతో హీరో నాగార్జున నాగచైతన్య, అమలతో పాటు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, నాని, వెంకటేశ్, మహేశ్ బాబు, ప్రభాస్ వంటి టాలీవుడ్ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు. సమంత సైతం మంత్రి హోదాలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని అన్నారు. తమను మీ అవసరాలకోసం రాజకీయాల్లోకి లాగొద్దని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ఇండస్ట్రీతో పాటు బీఆర్ఎస్ నేతలు కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ కావటంతో ఆమె దిగొచ్చి.. తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నారు. సమంతకు క్షమాపణలు చెప్పారు. కానీ, కేటీఆర్ ను మాత్రం వదిలేది లేదని హెచ్చరించారు. అయితే, సమంత, నాగచైతన్య విషయంలో వివాదం సమసిపోయిందని అందరూ భావించారు. హీరో నాగార్జున మాత్రం కొండా సురేఖను వదిలేది లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీసేలా కొండా సురేఖ తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టులో నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో నాంపల్లి కోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. దీనికి తోడు సురేఖపై 100కోట్ల పరువు నష్టం దావా వేస్తానని నాగార్జున చెప్పారు. పరువు నష్టం దావాలు కోర్టుల్లో ఏళ్ల తరబడి కొనసాగుతాయన్న విషయం తెలుసని.. అయినా, ఆ పోరాటానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తమకు సత్వర న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది తనకు ఒకదాని వెనుక ఒకటిగా సమస్యలు వస్తున్నాయన్న నాగార్జున.. అయినా ఇబ్బంది లేదని, తానొక బలమైన వ్యక్తినని, కుటుంబాన్ని రక్షించుకునే విషయంలో సింహంలా ఉంటానని ధీమా వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం మద్దతుగా వచ్చిందని.. తన తండ్రికున్న గౌరవం, ఆయన ఆశీస్సులే కారణమని అభిప్రాయపడ్డారు. అయితే, కొండా సురేఖ విషయంలో నాగార్జున అతిగా వ్యవహరిస్తున్నారన్న వాదన కాంగ్రెస్ వర్గాల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ రాజకీయ క్రీడలో నాగార్జున పావుగా మారుతున్నారని, ఈ అంశంపై మంత్రి వెనక్కు తగ్గినా నాగార్జున అదే విషయాన్ని పట్టుకొని రాద్దాంతం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున తీరుపై టాలీవుడ్ లోని కొందరు ప్రముఖులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునకు కేటీఆర్, కేసీఆర్ లతో మంచి సంబంధాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వారి ప్రోద్భలంతోనే నాగార్జున అతిగా ప్రవర్తిస్తున్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ రాజకీయ అవసరాలకోసం టాలీవుడ్ హీరోలను వాడుకోవటం కొత్తేమీ కాదని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఇదే సమయంలో నాగార్జునపై కేసు నమోదైంది. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేశారని జనం కోసం అనే స్వచ్చంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ సిటీ ప్రాంతంలోని తమ్మిడికుంటను కబ్జా చేసి ఎన్-కన్వెన్షన్ నిర్మించి లాభాలు ఆర్జించారని వెంటనే క్రిమినల్ చర్యలు నమోదు చేయాలంటూ భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకున్న పోలీసులు నాగార్జునపై కేసు నమోదు చేశారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని క్షమాపణలు చెపపినా, నాగార్జున మాత్రం కేటీఆర్ సూచనలతో ముందుకెళ్తూ అనవసరంగా చిక్కుల్లోపడుతున్నారని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ ఆడుతున్న రాజకీయ క్రీడలో నాగార్జున పావుగా మారొద్దని వారు సూచిస్తున్నారు. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకున్నందున నాగార్జున ఇప్పటికైనా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయడం మంచిదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/nagaarjuna-scape-goat-in-brs-political-game-25-186322.html