మునుగోడులో బీజేపీ బిల్డప్ అంతా డొల్లేనా? టీఆర్ఎస్ దే పై చేయి అంటున్న సర్వే
Publish Date:Aug 12, 2022
Advertisement
మునుగోడులో బీజేపీకి అంత సీన్ లేదా? కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి చేత రాజీనామా చేయించి మరీ ఉప ఎన్నికకు తెరతీసిన బీజేపీకి మునుగోడులో భంగపాటు తప్పదా? అంటే తాజా సర్వే ఫలితం ఔననే అంటోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో కలిసి వచ్చినట్లు మునుగోడులో బీజేపీకి ఎంత మాత్రం కలిసి వచ్చే అవకాశాలు లేవని, ఇప్పటి దాకా రాష్ట్రంలో ఆ పార్టీ ఇచ్చిన బిల్డప్ అంతా డొల్లేనని మునుగోడు ఫలితం తేల్చేస్తుందనీ ఆ సర్వే బల్ల గుద్ది మరీ చేబుతోంది. మునుగోడులో పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యేనని బీజేపీ మూడో స్థానానికి పరిమితమౌతుందని పేర్కొంది. సాస్ గ్రూప్ ఆత్మసాక్షి సర్వే గ్రూప్ కు చెందిన ఇండియన్ పొలిటికల్ సర్వేస్ అండ్ స్ట్రాటజీస్(ఐపిఎస్ఎస్) టీమ్ఈ సర్వేను చేయించింది. మండలాల వారీగా, కులాల వారీగా, లబ్ధి దారుల వారీగా ఈ సర్వే చేసినట్లు పేర్కొంది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో రెండు విధానాలలో సర్వే చేసినట్లు ‘ఓటా’ పేర్కొంది. ఒకటి రాండమ్ సర్వే కాగా మరొకటి సెలెక్టివ్ సర్వేగా వివరించింది. ఇలా జరిపిన సర్వేలో మునుగోడులో బీజేపీ పుట్టిమునగడం ఖాయమని తేలిందని పేర్కొంది. బీజేపీ మునుగోడు ఉప ఎన్నికలో మూడో స్థానానికే పరిమితమౌతుందని స్పష్టమైందని సర్వే పేర్కొంది. ఈ నెల 8-11 తేదీల మధ్యలో నిర్వహించిన ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు మునుగోడు ఉప ఎన్నిక జరిగితే బీజేపీది బలం కాదు వాపు మాత్రమేనని తేలిపోవడం ఖాయమని సర్వే వెల్లడించింది. మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలలోనూ ర్యాండమ్ పద్దతిలో సర్వే నిర్వహించినట్లు పేర్కొంది. నాంపల్లి మండలంలో 790 , మర్రిగూడ మండలంలో 390, చందూరు మండలంలో 850, మునుగోడు మండలంలో 589,చౌటుప్పల్ మండలంలో 1020, గట్టుప్పల్ మండలంలో 200, నారాయణ పూర్ మండలంలో 520 శాంపిల్స్ చొప్పున సర్వే చేసినట్లు వివరించింది. నియోజకవర్గం మొత్తంలో 4350 మందిని ర్యాండమ్ గా ప్రశ్నించి వారి అభిప్రాయం తెలుసుకున్నట్లు వివరించింది. దాదాపు అన్ని మండలాలలోనూ టీఆర్ఎస్ కే మొగ్గు కనిపించిందని సర్వే ఫలితం తేల్చింది. సగటు ఓటు షేరు తీసుకుంటే టీఆర్ఎస్ కు 40శాతం, కాంగ్రెస్ కు 34.75 శాతం, బీజేపీకి 18 శాతంగా తేలిందని పేర్కొంది. ఇతరులు 3.25 శాతంగా ఉండగా ఎటూ మొగ్గు చూపని వారు అంటే సైలెంట్ వోట్ ఫ్యాక్టర్ 4 శాతంగా సర్వే పేర్కొంది. దీనిని బట్టి రాష్ట్రంలో బీజేపీది వాపే కాదు బలమేనని సర్వే ఫలితం తేల్చేసింది. మునుగోడులో ప్రధాన పోటీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ల మధ్యేనని, నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు రాజగోపాల రెడ్డి రాజీనామాకు రేవంత్ పై వ్యతిరేకత, కాంట్రాక్టులే కానీ నియోజకవర్గ అభివృద్ధి కాదని భావిస్తున్నారని పేర్కొంది. మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకునే టీఆర్ఎస్ సర్కార్ చేనేత బీమా ప్రకటించిందనీ, దీర్ఘ కాలంగా ఇక్కడి ప్ర.జలు డిమాండ్ చేస్తున్నగట్టుప్పల్ మండలాన్ని ప్రకటించడంతో జనం టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని కూడా సర్వే పేర్కొంది.
http://www.teluguone.com/news/content/munugodu-mood-says-yes-to-trs-tight-fight-from-congress-25-141792.html