తెలుగు ప్రజల పాలిట దైవ ప్రసాదం.. ముక్త్యాల రాజా
Publish Date:Dec 17, 2023
Advertisement
నాగార్జున సాగర్ లేనిదే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు లేవు. ముఖ్యంగా సాగర్ లేకపోతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం.. ఏపీలోని ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలు లేనే లేవు. ఇప్పుడంటే ఈ నాలుగు ఉమ్మడి జిల్లాలు పారిశ్రామికంగా ఎదిగాయి. కానీ, ఇండియాకి స్వాతంత్య్రం రాకముందు ఈ జిల్లాలలో నిత్యం కరువు తాండవించేది. పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. కురిస్తే అతివృష్టి లేకపోతే అనావృష్టి అనేలా ఉండేది పరిస్థితి. ఇది చూసి చలించిన ముక్త్యాల రాజా వారు కృష్ణానదిపై ఓ ప్రాజెక్టు నిర్మించాలని కంకణం కట్టుకున్నారు. అప్పటికి ఇండియాలో స్వాతంత్య్ర ఉద్యమం ముమ్మరంగా సాగుతున్నది. అయినా రాజావారు పట్టువదలని విక్రమార్కుడిలా నాగార్జున సాగర్ నిర్మాణానికి ప్రయత్నించి చివరికి ఇండియాకి స్వాతంత్య్రం వచ్చాక ప్రాజెక్టు నిర్మాణాన్ని సాధించారు. ఒక్క మాటలో చెప్పాలంటే నాగార్జున సాగర్ నిర్మాణానికి ముక్త్యాల రాజా కృషి అంతా ఇంతా కాదు. ఆర్ధికంగా సొంత నిధులు ఇవ్వడంతో పాటు తానే స్వయంగా వందల కిలోమీటర్లు నడిచి తెలుగు రైతులను సంఘటితం చేసి ఈ ప్రాజెక్టును సాధించారు. ముక్త్యాల రాజా అసలు పేరు వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్. ఎంతో పేరు ప్రతిష్ఠలు గల వాసిరెడ్డి వంశానికి చెందిన వారసుడు. ముక్త్యాల సంస్థనాధీశుడు. ముక్త్యాల రాజాను ప్రాజెక్టుల ప్రసాద్ అని కూడా పిలిచేవారు. తొలుత ముక్త్యాల రాజా కృష్ణా నదిపై పులిచింతల ప్రాజెక్తు నిర్మాణానికి పూనుకున్నారు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పూర్తై ఉపయోగంలోకి వచ్చింది. అప్పట్లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కృష్ణానది నీటిని కూడా తమిళనాడుకు తీసుకువెళ్లేలా కుట్రలు చేసింది. ఇందులో భాగంగా తొలుత కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేసేందుకు సిద్ధమైంది. ఇది తెలిసిన ముక్త్యాల రాజా ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ఊరూరూ తిరిగి నాగార్జునసాగర్ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. సొంత సొమ్ముతో రిటైరయిన ఇంజినీర్లను ఒక బృందంగా ఏర్పాటు చేసి ప్రాజెక్టుకు కావల్సిన ప్లానులు, డిజైనులు సిద్ధం చేయించారు. నంది కొండ వద్ద ఆనకట్ట కడితే బహుళార్ధసాధకంగా ఉపయోగపడుతుందనీ, తెలుగునేల అన్నపూర్ణగా మారుతుందని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు. మద్రాసు ప్రభుత్వం నాగార్జున సాగర్ నిర్మాణాన్ని అడ్డుకొనే ప్రయత్నం చేసినా.. రాజా కృష్ణా రైతు వికాస సంఘం స్థాపించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఈలోగా దేశానికి స్వాతంత్య్రం రావడంతో ముక్త్యాల రాజా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. విషయాన్ని గాంధీజీ, నాటి ప్రధాని జవాహర్లాల్ నెహ్రు, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. ముక్త్యాల రాజా ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ పరిశీలనకై ఖోస్లా కమిటీని నియమించింది. కానీ కమిటీ సభ్యులు నందికొండకు కార్లు, జీపులలో వెళ్లడానికి అనువైన దారి లేదనే సాకుతో దాటవేయాలని చూశారు. దీంతో అప్పట్లోనే వేల రూపాయల సొంత ఖర్చుతో, 25 గ్రామాల ప్రజలను, స్వయంసేవకులను సమీకరించి వారం రోజులు రాత్రింబగళ్ళు కష్టపడి కార్లు వెళ్లేలా దారి ఏర్పాటు చేయించారు ముక్త్యాల రాజా. దీంతో ఖోస్లా కమిటీ నందికొండ ప్రదేశం చూసి ప్రాజెక్టుకు అనువైన స్థలమని తేల్చారు. ఆ తర్వాత కూడా ఖోస్లా కమిటీ రిపోర్టును తొక్కిపెట్టేందుకు ఢిల్లీలో ప్రయత్నాలు జరిగాయి.అయితే ముక్త్యాల రాజా ఢిల్లీలో ప్రొఫెసర్ ఎన్.జి.రంగా, మోటూరు హనుమంతరావు, కొత్త రఘురామయ్య వంటి పార్లమెంటు సభ్యులతో ఆ రిపోర్టులను అందరికి పంచిపెట్టి, ప్లానింగ్ కమిషన్ సభ్యులను ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పించారు. అలాగే అప్పటి ఏపీ గవర్నరు చందూలాల్ త్రివేదిని ఒప్పించి ప్రధాని నెహ్రూను ప్రభావితం చేయడంతో 1954లో నాగార్జునసాగర్ నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది. 1955 డిసెంబరు 10న ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. 11 ఏళ్ల తర్వాత 1966 ఆగస్టు 3న ప్రాజెక్టు నుండి నీరు వదిలారు. ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ముక్త్యాల రాజా అప్పట్లోనే 52 లక్షల రూపాయిలు మాచింగ్ గ్రాంటుగా ఇచ్చారంటే ఆయన ఏ స్థాయిలో ఈ ప్రాజెక్టు ఉపయోగాన్ని నమ్మారో అర్ధం చేసుకోవచ్చు. వంశపార పర్యంగా వచ్చిన రాజరికంతో ఆయన తృప్తి చెందలేదు. తెలుగు నేలకు, ముఖ్యంగా రైతులకు ఏదో ఒకటి చేయాలనే తపన పడ్డారు. ఆయన ఆలోచనే, తపన, ముందు చూపు ఫలితమే పులిచింతల, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు సాకారమయ్యాయి. తెలుగు ప్రజల పాలిట వరంగా మారాయి. నేడు నాలుగు ఉమ్మడి జిల్లాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారంటే.. పాడి పంటలతో తులతూగుతున్నారంటే అందుకు ముక్త్యాల రాజా కృషి, పట్టుదల, సంకల్పం, సేవానిరతి కారణం అనడానికి ఇసుమంతైనా సందేహం లేదు. నేడు ఈ నాలుగు జిల్లాలో ప్రజలు అన్నం తింటున్నారంటే అది వాసిరెడ్డి రామ గోపాల కృష్ణ మహేశ్వర వర ప్రసాదమే. ఈ మహోన్నతుడు 1972లో స్వర్గస్థులయ్యారు. నేడు ఆయన 50వ వర్ధంతి. నిజానికి మనం తినే ప్రతి మెతుకు ముక్త్యాల రాజా ప్రసాదమే. ఆయన చిరస్మరణీయుడు. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భాసిల్లేందుకు శక్తికి మించి శ్రమించిన ఆయన గురించి భావితరాలకు తెలియజేయాలి. అదే ఆ మానుభావువుడికి మనమిచ్చే అసలైన నివాళి. ముక్త్యాల రాజా 50వ వర్ధంతి సందర్భంగా.. ప్రత్యేక వ్యాసం
http://www.teluguone.com/news/content/muktyala-raja-god-gift-to-telugu-people-39-167190.html





