అందని ద్రాక్ష పుల్లనంటున్న రాజయ్య
Publish Date:May 31, 2013
Advertisement
తెరాస అధ్యక్షుడు కేసీఆర్, కేశవ్ రావు, వివేక్, మందాలకు సకుటుంబ సపరివారంగా పార్టీలో జేరెందుకు టికెట్స్ పంచిఇచ్చి తనకు మాత్రం హ్యాండివ్వడంతో కాంగ్రెస్ పార్టీలో మిగిలిపోయిన రాజయ్య ఒడ్డున పడ్డ చేపలా గిలగిల కొట్టుకొంటున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ లోంచి తెరాసలోకి జంపు చేసేస్తున్నానహో!’ అని చాటింపు కూడా వేసేసుకొని మూట ముల్లె సర్దుకొని రోడ్డు మీదకి వచ్చేసిన తరువాత, కేసీఆర్ తనని మాత్రం వదిలిపెట్టి మిగిలిన ముగ్గురినే తన కారెక్కించుకొని బుర్రు మంటూవెళ్లిపోయి తన పరువు తీసాడని ఆయన ఆవేశంతో రగిలిపోతున్నారు. కేసీఆర్ తనని మోసం చేసాడని ఆయన ఆక్రోశిస్తున్నారు. అటువంటి వాడిని నమ్మి కాంగ్రెస్ నుండి బయటకు వెళ్ళకపోవడమే మంచిదయిందని తనను తానూ సముదాయించుకొని, ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే తెలంగాణా కోసం నిరంతర పోరాటం చేస్తానని ప్రకటించేశారు. తెలంగాణా సాదించేవరకు తన పోరాటం ఆగదని పనిలోపనిగా ప్రకటించేశారు. కేవలం తెలంగాణా ఉద్యమంలో పాల్గొనడానికే తెరాసలోకి వెళ్తున్నామని చెప్పుకొంటున్న ఆ ముగ్గురు నేతలు, కాంగ్రెస్ పార్టీలో చిక్కుకుపోయిన రాజయ్య అందరి ఆలోచనలు కూడా తమకీ, తమ సంతానానికి, ఇంకా వీలయితే తమ బందుగణానికి టికెట్స్ సంపాదించుకోవడమేనని ఈ వ్యవహారాలతో స్పష్టం అవుతోంది. టికెట్స్ ఇస్తే ఉద్యమం కోసం పార్టీ మారుతారు. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉద్యమం చేస్తామంటారు. దీనిని బట్టి తెలంగాణా సాదించుకోవడం పట్ల వారికెంత గొప్ప నిబద్దత ఉందో అర్ధం అవుతోంది. వారి ప్రాదాన్యత కేవలం పార్టీ టికెట్స్ కే తప్ప తెలంగాణాకి కాదని మరోమారు నిరూపించారు. ఇక, ఉద్యమం కోసం ఇంతకాలం పోరాడిన వారిని కాదని, టికెట్ ఎరలు వేసి ఇతర పార్టీలలోని ‘సౌండ్ పార్టీలను’ తమ పార్టీలోకి ఆకర్షించాలనుకోవడం కేసీఆర్ నైజం తెలియజేస్తోంది. ఏది ఏమయినప్పటికీ, తెలంగాణా సాధన కంటే రాబోయే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్స్ సంపాదించుకోవడమే నేడు అందరి ప్రధానధ్యేయంగా మారిందని జరుగుతున్న రాజకీయ పరిణామాలు తెలియజేస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/mp-rajaiah-39-23299.html