23 రోజుల ముందుగానే నైరుతి.. తెలంగాణకు వర్ష సూచన
Publish Date:May 16, 2022
Advertisement
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. ఈ ఏడాది 23 రోజుల ముందుగానే తొలకరి అండమాన్, నికోబార్ దీవులను పలకరించింది. దీంతో వచ్చే 24 గంటలలో అంటే మంగళవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాల విస్తరణ తో వానలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి ప్రభావంతో వచ్చే నాలుగైదు రోజుల్లో తొలకరి కేరళను తాకుతుందని పేర్కొన్న వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. అలాగే కర్నాటకకూ భారీ వర్ష సూచన ఉందని హెచ్చరింది. ఇక వేసవి ఉష్ణోగ్రతలు తగ్గుతాయనీ పేర్కొండి. మండే ఎండల నుంచి ఉపశమనం కలుగుతుందన్న చల్లటి కబురుతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల రైతుల మాత్రం ముందస్తు తొలకరి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళ్లాలలో ఉన్న ధాన్యం కాపాడుకోవడమెలా అన్న దిగులు వారిలో వ్యక్తం అవుతున్నది. ముఖ్యంగా తెలంగాణలో కొనుగోలు కేంద్రాలలో ధాన్యం వానకు తడిసిముద్దౌతుందన్న భయం వారిలో వ్యక్తం అవుతుంది. మద్దతు ధరకు ధాన్యం కొంటామంటూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సర్కార్, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమిని పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే ఈ కేంద్రాల్లో కొనుగోల్లలో తీవ్ర జాప్యం పట్ల ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆదివారం కురిసిన వర్షానికి పలు ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాలకు తీసుకు వచ్చిన ధాన్యం తడిసి ముద్దైంది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్న డిమాండ్ లో రైతులు ధర్నాలకు దిగారు. నేడు, రేపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయన్న సమాచారంతో రైతులలో ఆందోళన రెట్టింపైంది. ధాన్యం తడవ కుండా కాపాడుకోవడం కోసం నానా అగచాట్లూ పడుతున్నారు. టార్పాలిన్లతో గాలి వాన నుంచి ధాన్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/monso0n-enters-andaman-nicobar-23-days-earlier-39-135984.html





