మోడీ తెలంగాణ పర్యటన.. ఈ సారైనా కేసీఆర్ పాల్గొంటారా?
Publish Date:Jul 6, 2023
Advertisement
ప్రధాని తెలంగాణ పర్యటన అనగానే ప్రొటోకాల్ ప్రకారం సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలుకుతారా? అన్న అనుమానాలు రావడం సర్వసాధారణమైపోయింది. గత ఏడాదిన్నర కాలంగా ప్రధాని అధికారిక పర్యటనపై ఎప్పుడు తెలంగాణకు వచ్చినా రాష్ట్రంలో ఉండకుండా దేశ వ్యాప్త పర్యటన అనో, అనారోగ్యమనో కేసీఆర్ ఆయనకు ఎదురుపడటం లేదు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఐక్యత కూడగట్టడంలో విఫలమైన కేసీఆర్ ఇప్పుడు మోడీపై, ఆయన సర్కార్ పై, అలాగే బీజేపీపై విమర్శల తీవ్రతను కనీస స్థాయికి తగ్గించారు. అయినా శనివారం మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలుకుతారా అంటే పరిశీలకులు అనుమానమనే అంటున్నారు. ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొనాల్సి ఉంటుంది. అయితే కేసీఆర్ ప్రొటోకాల్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. రాష్ట్ర గవర్నర్ విషయంలో బీఆర్ఎస్ నేతలూ, చివరాఖరకు అధికారులు కూడా ప్రొటో కాల్ పాటించడం లేదన్న విషయం తెలిసిందే. గతంలో ఒక సారి తెలంగాణలో హైదరాబాద్ లో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు మోడీ హైదరాబాద్ వచ్చారు. ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి.ఆయనకు ఆహ్వానం కూడా వచ్చింది. అయినా కేసీఆర్ డుమ్మా కొట్టారు. అలా డుమ్మా కొట్టడానికి కారణం పీఎంవో నుంచి తనను ఆ కార్యక్రమంలో పాల్గొనవద్దంటూ వచ్చిన సూచన అని చెప్పారు. అయితే దానిని పీఎంవో ఖండించడంతో కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే మోడీకి ముఖం చాటేశారని అర్ధమైంది. అలాగే హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇంకా ఇక్రిశాట్ లో కార్యక్రమానికీ డుమ్మా కొట్టారు. అదే విధంగా గత ఏడాది నవంబర్ 12న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సభకూ కేసీఆర్ డుమ్మా కొట్టారు. అప్పట్లో ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాల విషయంలో కేసీఆర్ మోడీ లక్ష్యంగానే విమర్శలు గుప్పించారు. మీడియా మీట్ లలో కూడా మోడీనే నేరుగా నిలదీస్తూ విమర్శలు గుప్పించారు. యథావిథిగా అప్పుడు కూడా మోడీకి ఎదురు పడలేదు. ఇక ప్రస్తుతానికి వస్తే.. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు గతంలోలా లేవు. ఇప్పుడు కేసీఆర్ ప్రధాని మోడీ సర్కార్, బీజేపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలకూ కూడా ఇప్పుడు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్. అందుకే ప్రధాని మోదీ శనివారం (జూలై 7) తెలంగాణ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం చెప్పే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ప్రధాని మోడీకి కేసీఆర్ ఆహ్వానం పలికితే.. బీఆర్ఎస్ బీజేపీకి బీటీమ్ అంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవమేనని జనం భావిస్తారు.. కనుక కేసీఆర్ మోడీకి ఎదురేగి ఆహ్వానం పలికే అవకాశం లేదంటూ విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే మోడీ తెలంగాణ పర్యటన విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. మోడీ పర్యటనలో భాగంగా కాజీపేటలో రైల్వేశాఖ ఏర్పాటు చేయనున్న వేగన్ ఓవర్ హాలింగ్ సెంటర్ కు, వరంగల్ మెగా టెక్స్ టైల్ పార్క్కు శంకుస్థాపన చేస్తారు. ఇవి రెండూ కూడా అధికారిక కార్యక్రమాలు. ప్రధాని అధికారిక కార్యక్రమాల కోసం ఏ రాష్ట్రానికి వెళ్లినా ఆయా రాష్ట్రాల సీఎంలు పాల్గొంటారు. బీజేపీ విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ , తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్ వంటి వారు ప్రధాని వస్తే ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానం పలుకుతారు. అయితే కేసీఆర్ తీరు మాత్రం వేరే. అందుకే ప్రధాని పర్యటనలో కేసీఆర్ పాల్గొంటారా? లేదా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
http://www.teluguone.com/news/content/modi-telangana-tour-39-157933.html





