నీరో చక్రవర్తిలా ప్రధాని మోడీ తీరు
Publish Date:Jun 19, 2022
Advertisement
దేశం తగులబడిపోతుంటే.. నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నారని విన్నాం.. కానీ ప్రధాని నరేంద్రమోడీ తీరు చూస్తుంటే సరిగ్గా నీరో చక్రవర్తే గుర్తుకొస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ..నమో అంటూ అభిమానుల చేత ప్రశసంలు అందుకుంటుంటారు. అయితే ప్రధానిగా ఆయన తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే విధానాలపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఇటీవలి కాలంలో ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం, అమలు చేస్తున్న ప్రతి విధానం ప్రజలలో అసంతృప్తికి, ఆగ్రహానికీ కారణమౌతూనే ఉంది. అయితే ఆయన మాత్రం తన విధానాలను, నిర్ణయాలను వ్యతిరేకించే వారంతా దేశాభివృద్ధిని వ్యతిరేకిస్తున్న వారే అంటు ఎదురుదాడి రాజకీయంతో అణచివేయాలని చూస్తున్నారు. వ్యవసాయ చట్టాల విషయం తీసుకున్నా..ఇప్పుడు అగ్నిపథ్ పథకాన్ని తీసుకున్నా.. ఆయన తీరు ఒకేలా ఉంది. ఈ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆగ్రహ జ్వాలలు ఎగసిపడుతున్నా మోడీ మాత్రం నీరో చక్రవర్తిలా ఫిడేలు వాయింపు లాంటి మాటలే మాట్లాడుతున్నారు. రైతు చట్టాల విషయమే తీసుకుంటే.. విపక్షాలను విశ్వాసంలోకి తీసుకోకుండా, ఎటువంటి చర్చకు తావివ్వకుండా.. పార్లమెంటులో ప్రవేశ పెట్టి విపక్షాల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా సభలో మంద బలంతో ఆమోదింప చేసుకున్నారు. ఈ విషయంలో విపక్షాల అభ్యంతరాలు, సూచనలను అసలు పరిగణనలోనికే తీసుకోలేదు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు సుదీర్ఘ ఉద్యమం చేశారు. హస్తిన సరిహద్దుల్లో టెంట్లు వేసి ఆందోళనలు చేశారు. లాఠీ దెబ్బలు తిన్నారు. ఉద్యమంలో పలువురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఆయన మౌనముద్ర వీడలేదు. అనివార్యంగా రైతు ఉద్యమం గురించి మాట్లాడాల్సి వచ్చినా కొన్ని శక్తులు రైతులను పక్కతోవ పట్టిస్తున్నాయన్న మాటనే పదే పదే వల్లె వేశారు తప్ప.. వారి వ్యతిరేకత వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఒక వైపు రైతు ఉద్యమం ఉదృతంగా సాగుతుండగానే ఆయన విదేశీ పర్యటనలతో కాలం గడిపేరు. యథా రాజా.. అన్న చందంగా మోడీ ఇలా మొండిగా వ్యవహరిస్తుంటే.. ఆయన కేబినెట్ లోని మంత్రులు సైతం అదే విధంగా ఇష్టారీతిన రైతుల ఉద్యమంపై విమర్శలు గుప్పించారు. విపక్షాలను నిందించారు. దేశంలో రైతు బాగుపడటం కొన్ని రాజకీయ పార్టీలకు ఇష్టం లేదని విమర్శించారు. రైతుల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయని అనడానికీ వెనుకాడలేదు. సరే ఆ తరువాత ఏం జరిగిందో తెలిసిందే. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ మోడీ రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.
ఇప్పుడు అగ్నిపథ్ విషయంలోనూ అంతే.. ఒక విధాన నిర్ణయం తీసుకునేటప్పడు విపక్షాలతో చర్చించడం కానీ, సభలో ప్రవేశ పెట్టి సమగ్ర చర్చ జరపడం కానీ లేకుండానే.. ఆర్మీ రిక్రూట్ మెంట్ లో అగ్నిపథ్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించేశారు. దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభం కాగానే ఆయన గతంలోలానే ఇది దేశ ప్రగతిని ఓర్వలేని శక్తులు నడిపిస్తున్న ఉద్యమం అంటూ ఓ విమర్శ చేసేసి తన స్వరాష్ట్రంలో పర్యటనకు వెళ్లిపోయారు. సరిగ్గా సాగు చట్టాల విషయంలో వ్యవహరించినట్లు మోడీ కేబినెట్ లోని మంత్రులు మాత్రం అగ్నిపథ్ పథకాన్ని అద్భుతం అని అభివర్ణిస్తూ, వ్యతిరేక ఆందోళనల వెనుక దేశ వ్యతిరేక శక్తులు ఉన్నాయనీ, ఆర్మీ బలోపేతం కావడం ఇష్టం లేని శక్తులే వెనుకుండి ఈ ఆందోళనలను రెచ్చగొడుతున్నాయనీ విమర్శలు మొదలెట్టేశారు. ఈ రెండు విషయాలలోనే కాదు.. గత ఎనిమిదేళ్లుగా ప్రధాని మోడీ ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలకు వ్యతిరేకంగా ఎవరు గళమెత్తినా వారిపై దేశ వ్యతిరేకులు, ప్రగతి నిరోథకులు అన్న ముద్ర వేయడం మోడీ ప్రభుత్వానికి ఒక ఆనవాయితీగా మారిపోయింది. సమస్యను పక్కతోవ పట్టించేందుకు దేశ భక్తి అంశాన్ని ఉపయోగించుకునే మోడీ తీరు మారాలి. సమస్యలపై, ప్రజాందోళనలపై అన్ని పక్షాలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నించాలి.
http://www.teluguone.com/news/content/modi-scilence-on-peoples-agitations-25-137993.html