వారసత్వ రాజకీయాల విషయంలో గురివింద సామెత చందంగా మోడీ తీరు!
Publish Date:Sep 6, 2022
Advertisement
ఈసారి మనోడ్ని తెరమీదికి తేవాలి.. ఈ మాట ప్రతీ రాజకీయనాయకుడు, ప్రతీ పారిశ్రామికవేత్త అనుకుం టారు. వ్యాపార, రాజకీయసంబంధాలు, అభివృద్ధిని ఆశించడం ఒక ఎత్తయితే, దాన్ని వీలయినంత కాలం కాపాడుకోవడానికి, తమకు అనుకూలం చేసుకోవడానికి తమవారిని రంగప్రవేశం చేయించడం ఆన వాయితీగా వస్తోంది. రాజకీయాల్లో ఇది చాలాకాలం నుంచే ఉంది. అయితే దీని వల్ల యువత, రాజకీయా ల్లోకి వచ్చి దేశాభివృద్ధికి పాటుపడేవారి కలలు కల్లలుగా మిగిలిపోతాయన్న అభిప్రాయం ప్రధాని మోదీతో పాటు చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ఇందులోనూ నిజం లేకపోలేదు. కానీ మారుతున్న కాలమాన పరిస్థి తులు, వాణిజ్య,రాజకీయావసరాలకు అనుగుణంగా తమను సుస్థిరపరచుకోవడానికి వెనుకాడటం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారతదేశం ఎదుర్కొంటున్న రెండు ప్రధాన సవాళ్లలో వారసత్వ రాజకీయాలు, బంధుప్రీతి గురించి ప్రస్తావించారు. బంధుప్రీతి అనేది భారతదేశ సంస్థలను నిర్వీర్యం చేస్తోంది , వారసత్వ రాజకీయాలు కుటుంబ ప్రయోజనాల కోసం మాత్రమే, దేశానికి కాదని ప్రధాన మంత్రి అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగ సారాంశమిదే. మోడీ తన ప్రసంగం ముగించిన వెంటనే, ఆయన సన్నిహితుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ను నెటిజన్లు సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేశారు. బిసిసిఐ కార్యదర్శిగా జై షా ను అర్హతను ప్రశ్నించారు. ప్రధాని విమర్శించిన వారసత్వ రాజకీయాలకు బిజెపి ఎంత మాత్రం అతీతం కాదంటూ విమర్శకులు విశ్లేషణలు చేశారు. నాయకులను ఎన్నుకునేది ప్రజలేనని.. వారసత్వంగా పదవులు రావనీ విపక్షం మోడీ వ్యాఖ్యలకు బదులిచ్చింది. వారసత్వ రాజకీయాల గురించి మోడీ ఎంత సేపూ విపక్షాలపై విమర్శలు గుప్పిస్తారే తప్ప గురివింద సమెతలా పీయూష్ గోయల్, అనురాగ్ ఠాకూర్ అలాగే ఇతర పార్టీల నుంచి బీజేపీ గూటికి చేరిన సువేందు అధి కారి వంటి వారి గురించి ఎందుకు మాట్లాడరని కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామా మహమ్మద్ నిలదీస్తున్నారు. మోడీ తీరు అంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల పెరుగుదల, నిరుద్యోగం, వాగ్దానాల అమలులో తన వైఫల్యం, దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంలో తన వైఫల్యాల నుంచి జనం దృష్టి మరల్చడానికే మోడీ పదే పదే వారసత్వ రాజకీయాలను తెరపైకి తీసుకువచ్చి విపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. హర్యానాలో కాంగ్రెస్ మాజీ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమా రుడు కుల్దీప్ బిష్ణోయ్, ఈ నెల ప్రారంభంలో బిజెపిలో చేరిన కుల్దీప్ భార్య మాజీ శాసనసభ్యు రాలు రేణుకా బిష్ణోయ్ సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు. బిజెపిలో చేరడానికి ఒక రోజు ముందు, బిష్ణోయ్ తన నియోజకవర్గ ప్రజలు తన కుమారుడు భవ్యను తాను ఖాళీ చేస్తున్న అడంపూర్ అసెంబ్లీ స్థానం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు, నోయిడా ఎమ్మెల్యేయే కాకుండాయూపీ బిజెపి ఉపాధ్యక్షుడు కూడా. అలాగే, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే కుమారుడు దుష్యంత్ సింగ్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. బిజెపి వారసత్వ నేతల జాబితా చాలా పెద్దది. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పంజాబ్ నాయకుడు సునీల్ జాఖర్, కేంద్ర మాజీ హోం మంత్రి ఆర్.పి.ఎన్. సింగ్ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. కాగా బసవరాజు తండ్రి ఎస్.ఆర్. బొమ్మై, 1988-89లో కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ఏడాది మేలో బిజెపిలో చేరిన జాఖర్ - 1980 , 1989 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా కూడా పనిచేసిన కాంగ్రెస్ క్రియాశీల సభ్యుడు బలరామ్ జాఖర్ కుమారుడు. కాగా, ఆర్.పి.ఎన్. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనవరిలో బీజేపీలో చేరిన సింగ్, ఖుషీనగర్‌లోని పద్రౌనాకు చెందిన పూర్వపు సైంథ్వార్ రాజ కుటుంబానికి చెందినవారు. అతని తండ్రి, కున్వర్ చంద్ర ప్రతాప్ నారాయణ్ సింగ్, 1980లో ఇందిరా గాంధీ మంత్రివర్గంలో రక్షణ శాఖ సహా య మంత్రిగా పని చేశారు. వంశ పారంపర్య రాజకీయాల పట్ల పీఎం మోడీకి ఉన్న అయిష్టత అటువంటి నాయకులను బిజెపిలో లేదా ఆయన కేబినెట్ లో చేర్చుకోవడానికి అడ్డంకి కానప్పుడు ఇతర పార్టీలలో వారసత్వ రాజకీయ నేతల గురించి ఎలా మాట్లాడతారని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. మోడీ కేబినెట్ లో పలువురు ప్రముఖులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్, కిరెన్ రిజిజు , జ్యోతిరాదిత్య సింధియా వారసత్వ రాజకీయాల కారణంగా వచ్చిన వారేనని గుర్తు చేస్తున్నారు. గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, సువేందు అధికారి, ఆయన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి సిసిర్ అధికారి బీజేపీలో చేరిన విషయాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని యోగి క్యాబినెట్‌లో ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు జితేంద్ర ప్రసాద కుమారుడు జితిన్ ప్రసాదను కూడా బిజెపి చేర్చుకుని మంత్రిని చేసింది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర శాసన మండలి మాజీ సభ్యుడు గంగాధరపంత్ ఫడ్నవీస్ కుమారుడు. దేవేంద్ర అత్త శోభా ఫడ్నవీస్ రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. వారసత్వ రాజకీయాలను తమ పార్టీలో స్వయంగా ప్రోత్సహిస్తూ కూడా వంశపారంపర్య రాజకీయాలకు కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలే కేరాఫ్ అడ్రస్ గా ఉన్నాయనే ప్రచారాన్ని మోడీ విస్తృతంగా చేస్తున్నారని సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్‌కి చెందిన సంజయ్ కుమార్ అన్నారు . ఇంకా చెప్పాలంటే జననాయక్ జనతా పార్టీ నాయకుడు, హర్యా నా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, దేవీ లాల్-ఓం ప్రకాష్ చౌతాలా కుటుంబాలకు చెందిన నాల్గవ తరం నాయకుడు. యుపి , కేంద్రంలో బిజెపి కూటమి భాగస్వామి అనుప్రియా పటేల్ అప్నా దళ్ వ్యవస్థాపకుడు సోన్ లాల్ పటేల్ కుమార్తె. బీహార్ సిఎం నితీష్ కుమార్ కోరిక మేరకు రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ ఎన్‌డిఎ నుండి బయ టకు వచ్చిన తరువాత, మోడీ పాశ్వాన్ మామ పశుపతి పరాస్‌ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకున్నారు. శిరోమణి అకాలీదళ్, శివసేన వంటి అనేక ఇతర పార్టీలలో కీలక పాత్రపోషిస్తున్న పలువురు నాయకులు వారసత్వం కారణంగా తెరమీదకు వచ్చిన వారే. ఆయా పార్టీలతో కేంద్రంలోని మోడీ సర్కార్, బీజేపీ ఏదో ఒక సమయంలో పొత్తు పెట్టుకున్నాయి.
http://www.teluguone.com/news/content/modi-ignoring-dynesty-politics-in-bjp-and-trageting-opposition-25-143350.html





