ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్టు.. ఉద్యోగులకు వార్నింగ్?
Publish Date:Feb 10, 2022
Advertisement
జగన్ ప్రభుత్వం మళ్లీ యాక్షన్‌లోకి దిగింది. వరుసబెట్టి టీడీపీ నేతలను వెంటాడుతోంది. తాజాగా, మాజీ ఉద్యోగ సంఘాల నేత, టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబును గురువారం రాత్రి సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. విజయవాడలోని ఆయన ఇంటి నుంచి రాత్రి 11.30 గంటలకు అదుపులో తీసుకున్నారు. అశోక్‌బాబు అరెస్ట్ సందర్భంగా చిన్నపాటి డ్రామా నడిచింది. ఆయన కోసం పోలీసులు చాలాసేపటి నుంచి కాపు కాసి ఉన్నారు. అయితే, అశోశ్‌బాబు ఇంట్లో లేరు. ఓర పెళ్లికి అటెండ్ అయ్యారు. చాలా ఆలస్యంగా రాత్రి పదకొండున్నరకు ఇంటికి చేరుకున్నారు. అంతే, అప్పటికే అక్కడ మఫ్టీలో మాటు వేసిన సీఐడీ పోలీసులు ఆయన్ను వెంటనే అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్‌బాబును అరెస్టు చేసినట్లు, కోర్టులో హాజరపరచనున్నట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి నోటీసు అందించారు. అశోక్‌బాబు వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా, చదివినట్లు తప్పుడు ధ్రువపత్రాన్ని సమర్పించారనీ, మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్‌కుమార్ లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన లోకాయుక్త వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సీఐడీకి ఫిర్యాదు చేయాలని ఆ శాఖాధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఇటీవల అశోక్‌బాబుపై సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్షగట్టిందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేశారని మండిపడ్డారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పునకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అర్ధరాత్రి అశోక్‌బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.
http://www.teluguone.com/news/content/mlc-ashokbabu-arrested-at-midnight-39-131580.html





