ఉపాధి పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలి : మంత్రి సీతక్క
Publish Date:May 1, 2026
Advertisement
ఉపాధి హమీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష.. కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి.. మే మాసంలో మూడున్నర కోట్ల పనిదినాలు పూర్తి చేయాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఓలు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులతో ములుగు నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మే మాసం ఉపాధి హామీ పథకం అమలులో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఉపాధి కోరిన ప్రతి కుటుంబానికి పనిని కల్పించడం ప్రధాన లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులపై డిమాండ్ అధికంగా ఉన్నందున, సాంకేతిక, ఇతర సమస్యలను అధిగమించి ప్రతి కూలీకి పని అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మే మాసంలో కనీసం మూడున్నర కోట్ల పనిదినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో అధికారులు యజ్ఞంలా పనిచేసి కోటిన్నర పనిదినాలను పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పంట కోతలు ముగియడంతో ఉపాధి కూలీ పనులకు డిమాండ్ మరింత పెరుగుతుందని, అర్హులైన అన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పని ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ వంటి మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. కూలీల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉపాధి పనులు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా, తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచించారు. అలాగే తక్కువగా ఉపాధి పనులు జరుగుతున్న మండలాలు, గ్రామ పంచాయతీలను స్వయంగా పర్యవేక్షించాలని, పనిదినాల లక్ష్య సాధనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి హాబిటేషన్‌లో పనులు ప్రారంభించడం, ప్రతి ఉపాధి కోరుకునే వ్యక్తికి పని కల్పించడం, ప్రతి పని ప్రదేశంలో తగిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 ఉపాధి పనులను అందుబాటులో ఉంచడం, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించడం, ప్రత్యేక అధికారులను నియమించి పనుల పురోగతిని మెరుగుపరచడం వంటి చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లతో కలిసి ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/minister-seethakka-reviews-upadhi-hami-works-36-218766.html





