పంచాయతీ ఎన్నికల తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళతాం: మంత్రి నాని
Publish Date:Jan 21, 2021
Advertisement
ఏపీలో పంచాయతీ ఎన్నికలు యధావిధిగా జరపాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై.. సుప్రీంకోర్టుకు వెళ్తామని ఏపీ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై మంత్రి నాని స్పందించారు. ఎన్నికల కంటే తమ ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి ఈ సందర్భంగా తేల్చి చెప్పారు. ఎస్ఇసి నిమ్మగడ్డ అనుకున్నంత మాత్రాన ఎన్నికల కోడ్ అమలు కాదని ఆయన స్పష్టం చేసారు. ఈ విషయంపై తాము న్యాయ నిపుణులు, అధికారులతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కొద్దీ రోజుల క్రితం షెడ్యూల్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కారణంగా రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తోంది. ఇంకో వైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా పంచాయతీ ఎన్నికల నిర్వహణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్లో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని ఉద్యోగుల సంఘం ప్రకటించింది. ఉద్యోగులను బలవంతంగా విధులు నిర్వహించేలా ఒత్తిడి చేయడం సరికాదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి తెలిపారు. ఇది ఇలా ఉండగా గత నెలలో కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించిన సంగతి తెల్సిందే. కరోనా బాధితులు, 65ఏళ్లు దాటిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయవచ్చంటూ 27/A రూల్ ను సవరిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ ను సుప్రీం కోర్టు జస్టిస్ లావు నాగేశ్వరరావు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసే పిటిషన్ పై విచారణ జరిగే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఎస్ఇసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ కు సిద్ధమౌతున్నారు.
http://www.teluguone.com/news/content/minister-perni-nani-reaction-on-hc-verdict-on-local-body-polls-39-109077.html





