దక్షిణకొరియా పర్యటనలో మంత్రి నారా లోకేష్.. షోలమ్ గ్రూప్ ప్రతినిధులతో కీలక భేటీ.!
Publish Date:Jul 6, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షనే ధ్యేయంగా మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సియోల్‌లో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ షోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హా, ఆ సంస్థ ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ రంగాల అభివృద్ధి, పెట్టుబడుల విస్తరణపై చర్చించారు. ఈ సందర్భంగా, ఆంధ్రప్రదేశ్‌లోని పారిశ్రామిక హబ్ శ్రీసిటీ లో 338 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యుల్స్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు షోలమ్ గ్రూప్ యాజమాన్యానికి ధ్యాంక్స్ చెప్పిన లోకేష్.. ఈ ప్లాంట్‌కు సంబంధించిన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి, సాధ్యమైనంత త్వరగా ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతులు, మౌలిక వసతులను అత్యంత వేగంగా కల్పిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు. అలాగే.. తిరుపతిలో ఇప్పటికే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ టీసీఎల్ కి చెందిన డిస్‌ప్లే అసెంబ్లీ యూనిట్ ఉన్న విషయాన్ని మంత్రి లోకేష్ ఈ సమావేశంలో ప్రస్తావించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, షోలమ్ గ్రూప్ కూడా శ్రీసిటీలో తమ కార్యకలాపాలను మరింత విస్తరించాలని కోరారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఇతర డిస్‌ప్లే సంబంధిత అధునాతన ఉత్పత్తుల తయారీని ఆంధ్రప్రదేశ్‌లోనే చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రానిక్స్ తయారీకి గ్లోబల్ హబ్‌గా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా లోకేష్.. షోలమ్ గ్రూప్ శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌కు ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందనీ, భవిష్యత్తులో మరిన్ని వినూత్న ఉత్పత్తుల తయారీని ఏపీలోనే ప్రారంభించాలనీ చెప్పారు. కాగా మంత్రి లోకేష్ ప్రతిపాదనలకు షోలమ్ గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్ హా సానుకూలంగా స్పందించారు. Southkorea tour, AndhraPradesh, Investments, Naralokesh, Sricity
http://www.teluguone.com/news/content/minister-nara-lokesh--key-meeting-with-sholam-group-36-225143.html





