టెండరేస్తే.. బెండు తీస్తాం!
Publish Date:Jan 31, 2022
Advertisement
నెల్లూరు జిల్లాలో కొందరు వైసిపి నేతలు బిహార్ ని తలపించేలా చేస్తున్నారు. ఏ పని చేయాలన్నా వారి కను సైగల్లోనే జరగాలని ఆంక్షలు విధిస్తుండడంతో.. సర్కారు పాటకు పిలిచినా.. పనులు చెసేందుకు ఒక్క కాంట్రాక్టరూ ముందుకు రావడం లేదు. ఒకవేళ ఎవరైనా ముందుకు వచ్చినా టెండరు వేస్తే బెండు తీస్తామంటున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక పక్క రాష్టంలొ కేసులు పెడుతున్నారు. ఇప్పుడీ కేసు ఆంద్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. నెల్లూరు నగరంలోని పెన్నా పొర్లు కట్టకు సంబంధించిన పనికి నీటిపారుదల శాఖ అధికారులు 82 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు. ఆ పని దక్కించుకోవడం కోసం హైదరాబాదుకు చెందిన నిర్మాణ సంస్థ శ్రీ సాయికృష్ణ కసక్షన్స్ తరఫున గురుపాటి మురళీ కృష్ణారెడ్డి టెండర్ వేశారు. ప్రభుత్వం సూచించిన దానికన్నా 13 కోట్ల రూపాయలు తక్కువ కోట్ చేయడంతో పని మురళీ కృష్ణారెడ్డి సంస్థకే వచ్చింది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. సదరు పనిని తనకు అత్యంత సన్నిహితుడైన కాంట్రాక్టర్ కి ఇప్పించుకోవాలనుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాబాయి రూప్ కుమార్ యాదవ్ కి కోపం నషాళానికి అంటిందట. తన ఫోన్ లో నుండే కాకుండా మంత్రి ఫోన్ నుండి కూడా మురళీకృష్ణారెడ్డికి ఫోన్ చేసి బూతు స్వరాలు అందుకున్నారట. మమ్మల్ని కాదని నువ్వు ఎలా పనిచేస్తావో చూస్తాం... అంటూ చాలెంజ్ చేశారని మురళీకృష్ణారెడ్డి ఆరోపిస్తున్నారు. అసలు నెల్లూరులో ఎలా అడుగు పెడతావో చూస్తాం.. ఎలా పనిచేస్తావో చెయ్... అంటూ తీవ్రస్వరంతో దుర్భాషలాడారని మురళీకృష్ణారెడ్డి ఆరిపిస్తున్నారు. నోటితో చెప్పలేని భాషలో మాట్లాడారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో రెడ్లను పక్కన పెట్టి జగన్ మోహన్ రెడ్డి తమకు పట్టం కట్టి పెత్తనం ఇచ్చారని, అదీ తమ సత్తా అని, తమతో పెట్టుకుంటే అవతల ఎంతటి వ్యక్తయినా వదిలే ప్రసక్తే లేదన్నారని మురళీకృష్ణ ఆరోపిస్తున్నారు. మంత్రి, ఆయన బాబాయ్ మాటలకు మనస్తాపం చెందిన మురళీకృష్ణారెడ్డి హైదరాబాదులోని రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు కాల్స్ వచ్చిన రెండు నెంబర్ల వివరాలను, కాల్ రికార్డులను వారికి అందించారు. సదరు రెండు నెంబర్లలో ఒకటి రూప్ కుమార్ యాదవ్ ది కాగా, రెండవది మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెంబరుగా తెలంగాణ పోలీసులు గుర్తించి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ముందుగా రూపిని హైదరాబాదు వచ్చి కలవవలసిందిగా కాల్ చేశారంట. ఆయనకు రాను వీలుకాకుంటే తామే వచ్చి రాచమర్యాదలతో తీసుకెళ్తామని చెప్పారంట. ఈ వ్యవహారం ఆ నోటా ఈ నోటా పార్టీ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా చేరిందంటున్నారు. మరోవైపు బీసీ విభాగానికి చెందిన తెలుగుదేశం నాయకులు కూడా ఈ విషయంపై మండిపడుతున్నారు. దీన్ని ఇక్కడితో వదిలే ప్రసక్తే లేదంటున్నారు. ఇప్పుడు తాజాగా కథ పోలిస్ స్టేషన్ నుండి కోర్టుకి చేరిందని తెలుస్తోంది. తనతో పాటు తన కుటుంబ సభ్యుల మీద కూడా నీచమైన కామెంట్లు చేసిన బాబాయ్, అబ్బాయిలకు బుద్ధి చెప్పే తీరాలని మురళీకృష్ణారెడ్డి గట్టిగా నిర్ణయించుకుని పావులు కదుపుతున్నట్లు సమాచారం. మరోవైపు మురళీ కృష్ణారెడ్డితో వారు రాజీ ప్రయత్నాలు జరుపుతూనే మరోవైపు టెండర్లను రద్దు చేయించడానికి మంత్రి అన్ని రకాలుగా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. తనకు ఇష్టం లేకుండా ఇక ఆ పనిని ఆ కాంట్రాక్టర్ చేయడానికి వీల్లేదని మంత్రి పట్టు పడుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా ఇప్పటికే అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారని, కుంటిసాకులు చూపించి నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ను రద్దు చేయడానికి దారులు వెతుకుతున్నారని అంటున్నారు. విషయం కాస్తా సీఎంఓకు చేరడంతో తనకు, తన బాబాయికి అస్సలు పడడం లేదని, ఆయన్ని దూరంగా పెట్టినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా జోరుగా ప్రచారం మొదలు పెట్టారు. పరిస్థితులు చేయి దాటి పోతున్నాయన్న అనుమానం రావడంతో కొత్త డ్రామాకు తెర లేపారని వైసీపీ శ్రేణులే చెవులు కొరుక్కోవడం విశేషం. నెల్లూరు లాంటి ఎంతో రాజకీయ పరిపక్వత, పరిణతి గల జిల్లాలోనే ప్రజాప్రతినిధులు ఇలా ముఠా రాజకీయాలు నడిపిస్తుంటే అసలిలాంటి విషయాలు సీఎంకు చేరుతున్నాయా లేదా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. పలుకుబడి, పరపతి గల మురళీకృష్ణారెడ్డి లాంటివారినే బెదిరిస్తే ఇక సామాన్యుల సంగతేంటని ప్రజలు నిలదీస్తున్నారు. మరి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఎలా డీల్ చేస్తారో చూడాలి.
నెల్లూరు జిల్లా అనేక రాజకీయ, చారిత్రక పరిణామాలకు పురిటి గడ్డ. ఇక్కడి నేతలు మంత్రులు, ముఖ్యమంత్రులు అవడమే కాకుండా డిల్లీలో కుడా చక్రం తిప్పి, కేంద్రమంత్రులు, ఉపరాష్ట్రపతి వరకు ఎదిగారు. అలాంటిది ఇప్పుడు ఇక్కడి పరిస్థితులు మాత్రం బిహార్ ని తలపించేలా ఉన్నాయని, వైసీపీలోనే కొందరు సీనియర్ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మద్య ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు జిల్లాను మాఫియాకు అడ్డాగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఒక్కసారిగా వైసీపీ అధిష్టానం కంగు తింది. అయితే ఆయన అసంతృప్తి నేత అనే నెపంతో దాన్ని లైట్ తీసుకున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ బంధువుకే చుక్కలు చూపిండంతో.. వామ్మో నెల్లూరు ఇలా మారిందా అంటూ తెగ చర్చించుకుంటున్నారు ఆంద్రా జనం.
నెల్లూరు పెన్నా నది పొర్లు కట్ట పనులకు ప్రభుత్వం రూ. 82 కోట్ల రూపాయలకు టెండర్ పిలిచింది. ఆ పనికి అతి తక్కువగా కోట్ చేసి రూ. 69 కోట్లకు టెండర్ వేశాడు ఓ వైసీపీ బడా నేత బంధువు. పైగా ఈయన వేసిన టెండర్ వల్ల ప్రభుత్వానికి 18 కోట్లు ఆదా చేకూరింది. అయితే ఈ జిల్లాకే చెందిన కొందరు నేతలు ఇరిగేషన్ కాంట్రాక్టర్ కి టెండర్ వెనక్కు తీసుకోమని బీహార్ ముఠాల రేంజ్ లో బెదిరించారు. తక్కువ మొత్తానికి కోట్ చేసి పనిని దక్కించుకోవడమే ఆ కాంట్రాక్టర్ చేసిన పాపమా అని మొత్తుకున్నా వినలేదట. ప్రభుత్వానికి డబ్బులు మిగల్చాలనుకోవడం ఆయన చేసిన అన్యాయంగా ఆ నేతలకు కనపడింది. ఇప్పుడు సదరు నేతల ఆదేశాల మేరకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్ను రద్దు చేయడానికి అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
ఒకరు సాక్షాత్తూ ఈ రాష్ట్ర మంత్రి, ఇంకొకరు నెల్లూరు నగర డివ్యూటీ మేయర్. వీళ్ళిద్దరూ కలిసి ఒక బడా కాంట్రాక్టర్ కి వార్నింగ్ ఇచ్చారు. మాకు తెలియకుండా టెండర్ వేస్తావా... నీ అంతు చూస్తాం, నీ సంగతి తేలుస్తాం... అంటూ చిందులేశారట. అంతేకాదు రాయడానికి వీల్లేని నీచమైన భాషలో బూతులు తిడుతూ చెలరేగిపోయినట్లు సమాచారం. అవతల వ్యక్తి ఏమైనా సామాన్యుడా అంటే.. అదీ కాదు. నెల్లూరు పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకరరెడ్డికి అత్యంత సమీప బంధువు.
http://www.teluguone.com/news/content/minister-anilkumar-yadav-faction-politics-39-130960.html





