మెటాలో మరోసారి లేఆఫ్స్ కలకలం...8 వేల మందిపై వేటు?
Publish Date:Apr 18, 2026
Advertisement
ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలను వేధిస్తున్న లేఆఫ్స్ పర్వం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తాజాగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. రాబోయే నెల చివరి నాటికి దాదాపు 8 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సంస్థ ప్రణాళికలు రచిస్తోందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ తాజా పరిణామం టెక్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని విధుల నుంచి తప్పించేందుకు మెటా యాజమాన్యం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు, ఈ ఏడాది ద్వితీయార్థంలో మరిన్ని తొలగింపులు ఉండవచ్చనే వార్తలు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ భారీ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మళ్లుతున్న సంస్థ వ్యూహాలేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సంస్థ ఉన్నతాధికారులు ఏఐ రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులకు అనుగుణంగా సంస్థను పునర్వ్యవస్థీకరిస్తున్నారని, ఇందులో భాగంగానే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం. గత నెలలోనే మెటా తన ప్రపంచవ్యాప్త ఉద్యోగులలో 20 శాతం వరకు కోత విధించవచ్చని ప్రచారం జరిగింది. తాజాగా బయటకొచ్చిన 8 వేల మంది తొలగింపు వార్తలు దానికి కొనసాగింపుగానే కనిపిస్తున్నాయి. అయితే, ఈ విషయమై మెటా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం అమెరికాలోని ప్రముఖ కార్పొరేట్ సంస్థలన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. మెటా సీఈఓ మార్క్ జకర్‌బర్గ్ కూడా ఏఐ ఆధారిత సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉత్పాదకతను పెంచుకోవాలనే లక్ష్యంతోనే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. ఇటీవల అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 30 వేల మందిని, ఫిన్‌టెక్ సంస్థ 'బ్లాక్' సుమారు 4 వేల మందిని విధుల నుంచి తొలగించాయి. ఏఐ సాంకేతికత వల్ల పనులు వేగవంతం కావడంతోనే ఈ మార్పులు అనివార్యమవుతున్నాయని కంపెనీలు వాదిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ, వరుసగా జరుగుతున్న ఈ తొలగింపులు సాఫ్ట్‌వేర్ రంగంలోని ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో టెక్ సంస్థలు ఏ నిర్ణయాలు తీసుకుంటాయో, ఉద్యోగుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపడతాయో చూడాలి.
http://www.teluguone.com/news/content/meta-layoffs-36-217692.html





