దుబాయ్‌లోనే గౌతమ్ 'గుండె' వార్నింగ్?.. వీడియో వైరల్...
Publish Date:Feb 22, 2022
Advertisement
గుండెపోటుతో ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం తీవ్ర విషాదం నింపింది. అయితే.. అంతకు ముందు వారం రోజుల పాటు ఆయన దుబాయ్ లో జరిగిన ఎక్స్ పోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారికంగా పాల్గొన్నారు. అలా దుబాయ్ పర్యటనలో.. ఎక్స్ పోలో ఉన్నప్పుడే గౌతమ్ రెడ్డికి చిన్నపాటి గుండెపోటు వార్నింగ్ వచ్చిందా? అనే విధంగా ఆయన వీడియో ఒకటి మీడియాలో చక్కర్లు కొడుతోంది. దుబాయ్ ఎక్స్ పోలో గౌతమ్ రెడ్డి కాసేపు బాగా యాక్టివ్ గా కనిపించారు. అంతలోనే ఆయన కాస్త డల్ గా కూడా కనిపించారని తెలుస్తోంది. ఆ వీడియోలో గౌతమ్ రెడ్డి కుడిచేత్తో ఛాతీని పట్టుకున్న దృశ్యం కనిపిస్తోంది. అలా ఆయన ఒకటికి రెండు సార్లు ఛాతీని చేతి వేళ్లతో రుద్దుకుంటున్న దృశ్యం ఆ వీడియోలో ఉంది. అప్పటి వరకు చాలా హుషారుగా ఉన్న గౌతమ్ రెడ్డి ఆ తర్వాత కాస్త నెమ్మదిగా కనిపించారు. పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ఫిబ్రవరి 11న దుబాయ్ వెళ్లారు. వారం రోజులు దుబాయ్ లో పర్యటించారు. దుబాయ్ ఎక్స్ పోలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక రంగానికి పెద్ద పీట వేస్తున్నామని, మౌలిక వసతులు కల్పించడంలో ప్రాధాన్యం ఇస్తున్నామని ఎక్స్ పో వేదికగా తెలిపారు. ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి వివరంగా మాట్లాడారు. దుబాయ్ ఎక్స్ పోలో 12 థీమ్ లతో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్ ప్రారంభించారు. దుబాయ్ ఎక్స్ పోలో పలు రంగాల పరిశ్రమల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. గౌతమ్ రెడ్డి హైదరాబాద్ కు 20వ తేదీ తెల్లవారు జామున తిరిగి వచ్చారు. గౌతమ్ రెడ్డికి ఉదయాన్నే జిమ్ చేయడం అలవాటు. రాత్రి ఆలస్యంగా రావడంతో జిమ్ కు వెళ్లలేదు. ఆ రోజు సాయంత్రం గచ్చిబౌలిలో జరిగిన ఓ నిశ్చితార్థం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ మరుసటి రోజు అంటే సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అయితే.. ఆరోగ్యం పట్ల, ఫిట్ నెస్ పట్ల ఎంతో శ్రద్ధగా ఉండే గౌతమ్ రెడ్డి ఛాతీ ఇబ్బంది కలిగినా ఎందుకు ముందు జాగ్రత్తగా వైద్యులను సంప్రదించలేదో అర్థంకాని పరిస్థితి. ఛాతీలో చిన్నపాటి నొప్పి వచ్చినప్పుడు అది గ్యాస్ట్రిక్ అనో, ఇంకోదో చిన్న సమస్య అనో ఆయన లైట్ తీసుకున్నారా? అనిపిస్తోంది. దుబాయ్ లో రెండు రోజుల క్రితం గౌతమ్ రెడ్డి గుండె ఇచ్చిన చిన్నపాటి వార్నింగ్ మరో రెండు రోజుల్లో ఆయనను తుదిశ్వాస విడిచేలా చేసిందనే అభిప్రాయాం ఆ వీడియోను చూస్తే అర్థం అవుతోందంటున్నారు వైద్య నిపుణులు.
http://www.teluguone.com/news/content/mekapati-goutham-reddy-heart-warned-in-dubai-expo-39-132131.html





