నామినేషన్ తిరస్కరణ.. సుప్రీంను ఆశ్రయించిన మీనాక్షి నటరాజన్
Publish Date:Jun 11, 2026
Advertisement
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల రాజకీయం సుప్రీంకోర్టుకు చేరింది. రాజ్యసభ అభ్యర్థిగా తాను దాఖలు చేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన అత్యవసర పిటిషన్ ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ అతుల్ ఎస్ చందుర్కర్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ ను శుక్రవారం (జూన్ 12) విచారించనుంది. అంతకు ముందు ఈ పిటిషన్ విచారణార్హతపై సుప్రీం కొన్ని సందేహాలు వ్యక్తం చేసింది. అయితే.. మీనాక్షి నటరాజన్ తరఫున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ బలమైన వాదనలు వినిపించారు. రిటర్నింగ్ అధికారి తీసుకున్న నిర్ణయం, చట్టవిరుద్ధమని ఆయన ఆరోపించారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలను ఆ వివరిస్తూ, ఒక అభ్యర్థిపై కనీసం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే నామినేషన్ అఫిడవిట్‌లో తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కానీ ప్రస్తుత కేసులో మీనాక్షి నటరాజన్‌కు కేవలం ప్రాథమిక సమన్లు మాత్రమే జారీ అయ్యాయని, పూర్తి స్థాయి నేర విచారణ గానీ, శిక్ష గానీ ఖరారు కాలేదని వాదించారు. అందువల్ల ఈ చిన్న కారణంతో నామినేషన్ తిరస్కరించడం చెల్లదన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఈ నామినేషన్‌ను తిరస్కరించారని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
http://www.teluguone.com/news/content/meenakshi-natarajan-petition-in-supreme-court-36-222581.html





