శరణమంటోన్న ఏడు దేశాల ముస్లిమ్ లపై... రణమంటోన్న ట్రంప్!
Publish Date:Jan 28, 2017
Advertisement
ట్రంప్ రానూ వచ్చాడు. పని మొదలు పెట్టాడు కూడా. కాని, ఇప్పటికీ చాలా మందికి ట్రంప్ ఇన్ వైట్ హౌజ్ అనే సత్యాన్ని జీర్ణించుకోటానికి సాద్యం కావటం లేదు! అసలు ఆయన తన స్వంత పార్టీలోనే నెగ్గుకు రాడని భావించిన వారు ఇవాళ్ల ఆయన అమెరికాని శాసిస్తుండటం, పనిలో పనిగా ప్రపంచాన్ని తనదైన స్టైల్లో ప్రభావితం చేస్తుండటం తట్టుకోలేకపోతున్నారు. తాజాగా ఈ లిస్ట్ లో ఫేస్బుక్ ఓనర్ మార్క్ జూకర్ బెర్గ్ చేరాడు!
ట్రంప్ ఎన్నికలప్పుడు చెప్పిన మాటల్లో ప్రధానమైనవి ... మెక్సికో సరిహద్దులో గోడ. కొన్ని దేశల ముస్లిమ్ వలస జనం రాకుండా నిషేధం. ఈ రెండూ చేసేశాడు డొనాల్డ్. అదే ఇప్పుడు చాలా మందికి వెలక్కాయలా వుంది. మెక్సికో దేశాన్ని గట్టి కంట్రోల్ పెడతానన్న ట్రంప్ గోడ నిర్మాణం గురించి నానా హడావిడి చేస్తున్నాడు. అది చాలదన్నట్టు ఇరాన్, ఇరాక్, లిబియా, సిరియా లాంటి ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాకి వలస వచ్చే వారిపై నిషేదం విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశాడు!
ట్రంప్ ని మొదట్నుంచీ ముస్లిమ్ వ్యతిరేకిగా భావిస్తోన్న లిబరల్ అమెరికన్స్ కి ఇప్పుడు సీన్ క్లియర్ గా అర్థమైపోయింది. వారు భయపడ్డంతా నిజం చేస్తున్నాడు బిలియనీర్ బిజినెస్ మ్యాన్. అందుకే, ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్ బెర్గ్ తన టైమ్ లైన్ పై అభిప్రాయం పంచుకున్నాడు. అమెరికా అంటేనే వలస వచ్చిన జనాల దేశమనీ... అలాంటిది ట్రంప్ కొత్తగా వలస వచ్చే వారిపై నిషేధాలు విధించటం తప్పని ఆయన అన్నాడు. ఎవరి వల్ల భద్రతకు భంగం కలుగుతుందో... వార్నీ గుర్తించాలి కానీ... అందర్నీ ఒకేగాటన కట్టి అమెరికాలోకి రానీయకపోవటం ప్రమాదకరం అన్నాడు. తన ముత్తాతలు ఆస్ట్రేలియా, జర్మనీ, పోలాండ్ నుంచి వచ్చారని, తన భార్య తల్లిదండ్రులు చైనా, వియత్నామ్ ల నుంచి వలస వచ్చారనీ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అప్పుడే వలసలపై నిషేధం విధించి వుంటే తాము అమెరికాలో వుండే వారమే కాదని జూకర్ బెర్గ్ అన్నాడు!
మార్క్ జూకర్ బెర్గ్ ఆదర్శవాదం బాగానే వుంది కాని ట్రంప్ ఎన్నికలో కీలకమైన హామీల్లో వలసల్ని నిరోధించటం కూడా ఒకటి. ఆయన తెగించి ముస్లిమ్ లను లోనికి రానివ్వనని అనటంతోనే ఆయన ఓటర్లు తనకి ఓట్లు వేశారు. ఇప్పుడు ట్రంప్ ఆ పని చేయకపోతే వారు అతడ్ని క్షమించరు. అందుకే, ట్రంప్ రోజుకో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తో కలకలం రేపుతున్నాడు. ముందు ముందు ఈ చర్యల ఫలితం బాగున్నా, బాగాలేకపోయినా తీవ్రంగా వుండటం మాత్రం గ్యారెంటీ!
http://www.teluguone.com/news/content/mark-zuckerberg-45-71578.html





